జగన్ కంటే పెద్ద పదవిలో షర్మిల ?
జూన్ నెలలో షర్మిల పీసీసీ చీఫ్ మాత్రమే కాదు ఆమె పేరుకు ముందు రాజ్యసభ మెంబర్ అని కూడా జత అవుతుందని అంటున్నారు.
By: Satya P | 31 May 2026 8:30 AM ISTవైసీపీ అధినేత జగన్ ని రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న చెల్లెమ్మ షర్మిల. ఆమె 2020 తరువాత నుంచి వైసీపీకి దూరం అవుతూ వచ్చారు. ఆ మీదట ఆమె తనకంటూ సొంత రాజకీయం కోసం వైఎస్సార్ టీపీని తెలంగాణాలో స్థాపించారు. అలా ఆమె అక్కడ రాజకీయ మనుగడ కోసం అలుపెరగని కృషి చేశారు. భారీ ఎత్తున పాదయాత్రను కూడా నిర్వహించారు. ఇంత చేసినా ఆమెకు రాజకీయం కలిసి రాలేదు. తెలంగాణా కోడలుని అని ఆమె క్లెయిం చేసుకున్నా జనాల నుంచి సానుకూల స్పందన రాలేదు. ఆ సమయంలో ఆమె తెలివిగా చేసిన పని ఏంటి అంటే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడం. దానికి బదులుగా వెంటనే పీసీసీ చీఫ్ పదవి దక్కింది. అయితే ఆనాడు ఇచ్చిన మరో హామీ ఇపుడు నెరవేరబోతోంది. అదే ఆమెకు రాజ్యసభ సీటు.
అదే కనుక జరిగితే :
ఏపీ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం డిసైడ్ అయింది అని అంటున్నారు. అంతే కాదు పీసీసీ చీఫ్ గా షర్మిలనే కొనసాగించాలని ఆమె తోనే ఏపీ కాంగ్రెస్ ని బలోపేతం చేయాలని కూడా నిర్ణయించారని అంటున్నారు. ఈ క్రమంలో షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఆమె గొంతుకను మరింత బిగ్గరగా అటు పెద్దల సభలో ఇటు జనంలో వినిపించేలా చేయాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడగా చెబుతున్నారు. ఇంతకాలం షర్మిల కేవలం విమర్శలకే పరిమితం అయ్యారు. ఇపుడు ఆమె పార్లమెంట్ మెంబర్ గా కొన్ని అధికారాలు కలిగి ఉంటారు. ఎంపీ ల్యాండ్స్ నిధులు ఉంటాయి. అలాగే పార్లమెంట్ లో ఏపీ సమస్యలను ప్రస్తావించగలరు, ఈ విధంగా ఆమె ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త శక్తి వస్తుందని అంటున్నారు.
స్వయంగా రాహుల్ పిలిచి మరీ :
జూన్ నెలలో షర్మిల పీసీసీ చీఫ్ మాత్రమే కాదు ఆమె పేరుకు ముందు రాజ్యసభ మెంబర్ అని కూడా జత అవుతుందని అంటున్నారు. దాంతో అసలే తన వాగ్దాటితో తిరుగులేని పవర్ ని కలిగి ఉన్న షర్మిల మరింతగా జనంలోకి దూసుకుని పోతారు అని అంటున్నారు ఇక ఆమెకి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్న విషయం అధినాయకత్వం చెప్పింది అని ప్రచారం సాగుతోంది. స్వయంగా రాహుల్ గాంధీ ఆమెని ఢిల్లీకి పిలిపించి ఈ విషయం చెప్పారని అంటున్నారు. తన భర్తతో కలిసి షర్మిల తాజాగా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలసి వచ్చారని ఆమెకి ఈ జూన్ నెలలో అధికారికంగా ప్రమోషన్ దక్కడం ఖాయమని అంటున్నారు.
జగన్ కి మించుతారా :
ఏపీ నుంచి చట్ట సభలలో ప్రతిపక్ష వాయిస్ అయితే పెద్దగా వినిపించడం లేదు అన్న లోటు అయితే ఉంది. జనాల్లో కూడా అది చర్చగా ఉంది. ఎందుకంటే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ కూడా అసెంబ్లీకి వెళ్ళడం గత రెండేళ్ళుగా చేయడం లేదు. ఆ విధంగా ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యలు అయితే ప్రస్తావనకు రావడం లేదు. లోక్ సభ రాజ్యసభలలో చూసినా బీజేపీని గట్టిగా వైసీపీ ఎంపీలు నిలదీయడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇక కీలక బిల్లుల విషయంలో వైసీపీ కేంద్రానికి సహకరిస్తోంది అన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నా అది జనంలోకి బలంగా వెళ్లేందుకు ఆస్కారం లేకుండా పోతోంది. ఇదంతా వైసీపీ చేసుకున్న స్వయంకృతాపరాధం అని అంటున్నారు. దాంతో రాజ్యసభకు షర్మిల వెళ్తే కనుక ఏపీ సమస్యల మీద బీజేపీని గట్టిగా నిలదీయడమే కాకుండా జగన్ ని మించే విధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని అంటున్నారు.
ఆమె పదవి పెద్దది :
మరో వైపు చూస్తే జగన్ ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదాను అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. దానికి సరిపడా ఎమ్మెల్యేల బలం లేదని చెబుతున్నారు. అది నిజం కూడా. అంతే కాదు జగన్ జస్ట్ ఎమ్మెల్యే అని కూటమి మంత్రులు కీలక నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు ఇపుడు షర్మిల రాజ్యసభ ఎంపీ అయితే ఆమె పదవి జగన్ కంటే పెద్దది అని అంటున్నారు. ఆమె ఎంపీగా ఉంటారని పైగా ఆమె గొంతు బలంగా వినిపిస్తే కనుక జగన్ కి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. మరి ఈ రకమైన ఈక్వేషన్స్ అన్నీ సరిచూసుకునే కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తోంది అని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.
