షర్మిలకు శత్రులు ఎవరో కాదు.. ఆ రెండే.. !
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన విధానంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి.
By: Garuda Media | 30 April 2026 8:00 AM ISTరాజకీయాలు చేయడం అంటే కొన్నింటిని వదిలించుకోవాలి. మరికొన్నింటిని తగిలించుకోవాలి. వీటిలో ఏది ఎప్పటికీ అవసరం అవుతుంది.. అని చెప్పే విషయం నాయకులు వ్యవహరించే తీరునుబట్టి ఉంటుంది. అదేవిధంగా ప్రజల ఆశించిన అంశాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. రాజకీయాలు చేయడం అంటే కేవలం ఒక మూస విధానంలో చేస్తే కుదిరే పరిస్థితి ఈరోజు లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన విధానంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి.
ప్రతి విషయంలోనూ స్పాంటేనియస్ గా స్పందించే వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నాయకులు తమ వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు మార్చుకునే దిశగా అడుగులు వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయాన్ని చూస్తే రెండు కీలక అంశాలను ఆమె వదిలేస్తే తప్ప ఆమె గ్రాఫ్ పెరిగే పరిస్థితి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ నిశ్శబ్ద వాతావరణాన్ని గమనిస్తే ప్రతిపక్ష పార్టీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ప్రజల నుంచి ఒక వాదన వినిపిస్తోంది.
బలమైన ఉద్యమాలు చేసేవారు, బలమైన వాయిస్ వినిపించేవారు తగ్గుతున్నారన్న వాదన కూడా ఉంది. ఒకవైపు వైసీపీ నాయకులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నప్పటికీ ఇది అన్ని వర్గాలను చేరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఈ గ్యాప్ ను పూర్తి చేసేందుకు అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండు కీలక విషయాలను వదిలిపెట్టక తప్పదని కూడా చెబుతున్నారు.
ఒకటి.. వ్యక్తిగత అంశాలను ప్రజల అంశాలుగా, ప్రజల సమస్యలుగా మార్చటం సరికాదని సూచిస్తున్నారు .దీనిని మెజారిటీ ప్రజలు హర్షించటం లేదు. సహజంగా రాజకీయాలు అన్న తర్వాత అనేక సమస్యలు వస్తాయి. అనేక వివాదాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో వ్యక్తిగత అంశాలను ప్రజల సమస్యలుగా సృష్టించి ప్రచారం చేయడం ఎన్నికల్లో వాడుకునే దిశగా అడుగులు వేయడం అనేది సరికాదని అంటున్నారు. ఇక ఆస్తుల విషయంలో జగన్ ను పదేపదే విమర్శించడం అనేది షర్మిలకు కలిసి రాలేదని కూడా చెబుతున్నారు. జగన్ ను విమర్శించడం ద్వారా రెడ్డి సామాజిక వర్గంలో వైయస్ను అభిమానించే వారు కూడా షర్మిలకు దూరమయ్యారని అంటున్నారు.
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు అంశాల్లో షర్మిల కనుక ఆచితూచి వ్యవహరిస్తే రాష్ట్రంలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంటుందని ప్రజల్లోనూ చర్చ నడుస్తుందని చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా షర్మిల అడుగులు వేయాలని సూచిస్తున్నారు. తద్వారా తన ఇమేజ్ను తానే పెంచుకోవడంతో పాటు ఎన్నికల్లోను లబ్ది పొందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి షర్మిల ఆలోచన చేస్తారా లేదా అనేది చూడాలి.
