షర్మిల.. ఓ పొలిటికల్ ల్యాబొరేటరీ లెక్కేనా ...!
విజయవాడలో అమరావ తి కోసం ధర్నా చేపట్టినా.. తాజాగా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహార దీక్ష చేపట్టినా.. సీనియర్లు కనీసం ఆమెకు అండగా నిలవలేదు.
By: Tupaki Desk | 23 May 2025 11:00 PM ISTకాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఓ పొలిటికల్ ప్రయోగ శాలగా మారారా? ఎప్పుడు ఏం చేస్తే.. ఏం జరుగుతుందో ఆమె అంచనా వేసుకోవడం ఒకింత తడబాటు ధోరణిలోనే ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. ప్రజల సమస్యలను ప్రస్తావించడం ద్వారా.. నాయకులు ప్రజలకు చేరువ అవుతారు. ఇది రాజకీయాల్లో సహజం.
అయితే.. చిత్రం ఏంటంటే.. షర్మిల ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్నా.. వాటి ద్వారా ఆమెకు వస్తున్న మైలేజీ పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఆమె చేసుకున్న పనులో.. లేక.. ఆమె వ్యవహార శైలి నచ్చకపోవడంతోనో.. పార్టీ నాయకులు.. దూరంగా ఉంటున్నారు. విజయవాడలో అమరావతి కోసం ధర్నా చేపట్టినా.. తాజాగా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహార దీక్ష చేపట్టినా.. సీనియర్లు కనీసం ఆమెకు అండగా నిలవలేదు.
పైగా మీడియాలోనూ షర్మిల ఫోకస్ కాలేక పోయారు. ఈ ప్రయత్నాలు చేసినా.. ఆమెకు పేరు రాలేదు.. ఆమె ఫోకస్ కూడా కాలేదు. అయితే.. ఇదేసమయంలో తన సోదరుడు.. వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తే మాత్రం ఫస్ట్ పేజీలకు ఎక్కుతున్నారు. జగన్‌ను విమర్శిస్తే.. ఆమెకు ఎక్కడా లేని మైలేజీ వస్తోంది. దీంతో ఇక, ఆమె రాజకీయాలు.. జగన్ చుట్టూ తిరగడం ఖాయమని తెలుస్తోంది. పైగా.. ఇలా చేస్తేనే మీడియాలో అంతో ఇంతో మైలేజీ వస్తోందనికూడా గ్రహించారు.
అయితే.. దీనివల్ల.. ముఖ్యంగా షర్మిల చేస్తున్న ఈ రాజకీయ ప్రయోగాల కారణంగా ఓటు బ్యాంకు పెరుగు తుందా? కాంగ్రెస్‌పై సానుభూతి వస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి ఏ నాయకుడు అయినా.. ఏ పార్టీ అయినా.. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే.. వారిలోసానుభూతి పెరుగుతుంది. కానీ, షర్మిల ప్రయోగ శాలగా మారడం.. ప్రజల మాట ఎలా ఉన్నా.. పార్టీ నాయకుల నుంచే సరైన మద్దతు లేకపోవడంతో ఇప్పుడు ఆమె లేబొరేటరీగా మారిపోయారు. మరి భవిష్యత్తులో నాలుగేళ్లు ఏం చేస్తారో చూడాలి.
