Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా షర్మిల.. రీజనేంటో..?

పార్టీ పగ్గాలు చేపట్టిన నుంచి దూకుడుగా రాజకీయాలు చేసిన ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారనే చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు షర్మిల దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By:  Tupaki Desk   |   26 July 2026 1:00 AM IST
కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా షర్మిల.. రీజనేంటో..?
X

పార్టీ పగ్గాలు చేపట్టిన నుంచి దూకుడుగా రాజకీయాలు చేసిన ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారనే చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు షర్మిల దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఇటీవల విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత జరిగినా షర్మిల బయటకు రాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ధర్నాకు నిరసనగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలవగా, పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల మాత్రం హాజరుకాలేదు. దీంతో షర్మిల ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.

గత మూడు నెలలుగా షర్మిల రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఇతర కార్యక్రమాలలో కూడా ఎక్కడా కనిపించలేదు. చివరి సారిగా మే నెలలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో షర్మిల సమావేశమయ్యారని, ఆ తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదని కార్యకర్తలు చెబుతున్నారు. ఈ పర్యటన తర్వాత షర్మిల స్థానంలో వేరొకరికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా కొన్నాళ్లు హల్ చల్ చేసింది. అయితే పార్టీ నేతలు ఎవరూ ఈ విషయాన్ని ధృవీకరించకపోవడంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు.

ఇక షర్మిల మాత్రం ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనే సమాచారం లేక కార్యకర్తలు కొంత గందరగోళం ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. తాను అందుబాటులో లేని సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు చేసే షర్మిల ప్రస్తుతం వాటికీ కాస్త దూరంగానే ఉంటున్నారని అంటున్నారు. 22న పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో ‘ఎక్స్’లో ఫొటోలు షేర్ చేసి ఖండించిన షర్మిల మళ్లీ శనివారం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రమే స్పందించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఆ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ పరిస్థితుల్లో షర్మిల రాజకీయ కార్యక్రమాలపై హాట్ డిబేట్ జరుగుతోంది. అసలు షర్మిల రాష్ట్రంలో ఉన్నారా? లేక వ్యక్తిగత పర్యటనల నిమిత్తం బయటకు వెళ్లారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే మూడు నెలలుగా షర్మిల రాజకీయాలకు దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తుండటమే అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా, అధిష్టానం నుంచి సరైన ప్రోత్సాహం లేదన్న ఆవేదన చెందుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామనే కాంగ్రెస్ అధిష్టానం హామీ నెరవేరకపోవడంపైనా షర్మిల అసంతృప్తికి లోనవుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి షర్మిల మూడు నెలలుగా రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనేదే ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.