బాబు గారు.. ఆలోచించండి: షర్మిల లేఖ
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 16 April 2026 12:29 AM ISTఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆయనకే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల లేఖ సంధించారు. ``బాబు గారూ.. ఒకసారి ఆలోచించండి`` అని ఆమె పేర్కొన్నారు. దీనికి కారణం.. డీలిమిటేషన్. వాస్తవానికి గురువారం నుంచి పార్లమెంటు సమావేశం కానుంది. మూడు రోజులు జరిగే చర్చలో మహిళా రిజర్వేషన్ సహా.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించనున్నారు. దీనిలో మహిళా రిజర్వేషన్‌కు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
కానీ.. నియోజకవర్గాల పునర్విభజన విషయంపైనే కాంగ్రెస్ పార్టీ సహా.. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా మౌనంగా ఉంది. పోనీ.. ప్రతిపక్ష వైసీపీ అయినా.. స్పందిస్తోందా? అంటే.. ఆ పార్టీ కూడా మౌనంగా ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు 3 పేజల లేఖ రాశారు. దీనిలో డీలిమిటేషన్‌ను వ్యతిరేకించాలని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రతిపాదన ప్రకారం.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. ఏపీ వంటి రాష్ట్రాలకు నష్టం వస్తుందని పేర్కొన్నారు.
2011 జనాభా లెక్క ప్రకారం.. చేపట్టే పునర్విభజనను అడ్డుకోవాలని సూచించారు. ఈ బిల్లు ద్వారా ఏపీ రాజకీయంగా, ఆర్థికంగా కూడా నష్టాలు ఎదుర్కొంటుందని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు పెద్ద ముప్పుగా మారుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కానీ, 2011 లెక్కల ప్రకారం చేస్తే.. అది ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నిర్మొహమాటంగా అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఉభయ సభల్లోని ఏపీ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి డీలిమిటేషన్‌ను అడ్డుకోవాలని సూచించారు.
అసెంబ్లీని కూడా..
ఈ వ్యవహారంపై చర్చించేందుకు అసెంబ్లీని ఒకరోజు కొలువుదీర్చాలని షర్మిల సూచించారు. డీలిమిటేషన్ అనేది అతి పెద్ద అంశమని.. ప్రభుత్వంపైనా.. ప్రజలపైనా భారంపడేలా చేస్తుందని పేర్కొన్నారు. దీనిలో ఉన్న కుతంత్రాన్ని ఎండగట్టేందుకు అసెంబ్లీని ఇటీవల రాజధాని కోసం నిర్వహించినట్టే.. డీలిమిటేషన్‌పైనా నిర్వహించి చర్చించాలని షర్మిల సూచించారు. ``డీలిమిటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి`` అని సూచించారు. కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ ఈవిషయానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరారు.
