Begin typing your search above and press return to search.

జగన్-బీజేపీ బంధంపై షర్మిల క్లారిటీ, అన్నపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు

ఈ పరిస్థితిపై మాజీ సీఎం జగన్ మాట్లాడకపోవడం, కేంద్రాన్ని నిలదీయకపోవడాన్ని షర్మిల తప్పుపడుతున్నారు.

By:  Tupaki Political Desk   |   14 Feb 2026 12:16 PM IST
జగన్-బీజేపీ బంధంపై షర్మిల క్లారిటీ, అన్నపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు
X

పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు, మాజీ సీఎం జగన్ రెడ్డి లక్ష్యంగా ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా షర్మిల తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీతో జగన్ కొనసాగిస్తున్న రాజకీయ బంధాన్ని ఎత్తిచూపుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు అంటూ విమర్శించిన షర్మిల తాజాగా అంతకుమించి అన్నట్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా వైసీపీపై విమర్శల దాడిని తగ్గించిన షర్మిల.. ఆ గ్యాప్ మొత్తానికి సరిపడేలా ఒకేసారి విరుచుకుపడ్డారని అంటున్నారు.

ప్రధానంగా ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ప్రస్తావిస్తూ మాజీ సీఎం జగన్ లక్ష్యంగా షర్మిల విమర్శలు చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అడగటం లేదని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు, పవన్ అనుసరిస్తున్న రాజకీయ విధానాల వల్ల అడగలేకపోతున్నారని భావించినా, జగన్ ప్రశ్నించక పోవడం ఏంటని షర్మిల నిలదీశారు. జగన్ బీజేపీకి బినామీగా ఉండటం వల్లే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు.

జగన్ బీజేపీకి బినామీ అంటూ షర్మిల చేసిన కామెంట్లు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. గతంలో జగన్ ను ప్రధాని మోదీకి దత్తపుత్రుడని షర్మిల ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా బీజేపీకి బినామీ అంటూ చేసిన కామెంట్లు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయని అంటున్నారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులల్లో ఉందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై మాజీ సీఎం జగన్ మాట్లాడకపోవడం, కేంద్రాన్ని నిలదీయకపోవడాన్ని షర్మిల తప్పుపడుతున్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పరిరక్షణ యాత్ర పేరట షర్మిల ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల పర్యటన చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ప్రారంభించిన ఈ యాత్ర మార్కాపురం జిల్లాకు చేరుకుంది. రైతు కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేయడంపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందని షర్మిల విమర్శిస్తున్నారు. ఈ అంశంపైనా జగన్ మాట్లాడకపోవడాన్ని షర్మిల ఎత్తిచూపుతున్నారు. మొత్తానికి షర్మిల యథావిధిగా తన అన్నను లక్ష్యంగా చేసుకుని రాజకీయ విమర్శలు చేస్తుండటంతో తన వైఖరిని మార్చుకోలేదని స్పష్టం చేసినట్లు అయిందని అంటున్నారు.