జగన్ ఇంటికి షర్మిల.. వైఎస్సార్ కుటుంబంలో మళ్లీ కలయికకు తొలి అడుగులు?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి బెంగళూరులోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.
By: A.N.Kumar | 18 Sept 2026 5:28 PM ISTవైఎస్సార్ కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాల నేపథ్యంలో తాజాగా చోటుచేసుకోబోతున్న ఓ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి బెంగళూరులోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీ వెనుక రాజకీయ కారణాల కంటే కుటుంబ శుభకార్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం త్వరలో జరగనుంది. సెప్టెంబర్ 24న అంజిలి రెడ్డి–డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం నిర్వహించనున్నారు. నవంబర్ 25న వివాహం.. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనున్నట్లు షర్మిల అధికారికంగా వెల్లడించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఉంచి తండ్రి వైఎస్సార్ ఆశీస్సులు తీసుకున్న విషయాన్ని కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అన్న ఇంటి గడప తొక్కనున్న షర్మిల
ఇప్పుడు అదే పెళ్లి పత్రికను అన్న జగన్, వదిన భారతికి స్వయంగా అందజేసి ఆహ్వానించాలని షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే విజయమ్మతో కలిసి జగన్ ఇంటికి వెళ్లేందుకు ఆమె సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామం కేవలం ఓ కుటుంబ ఆహ్వానం మాత్రమేనా? లేక ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కుటుంబ విభేదాలకు ముగింపు పలికే దిశగా మరో అడుగా? అన్న చర్చ మొదలైంది.
గతంలో జగన్–షర్మిల మధ్య కుటుంబ, ఆస్తి అంశాలకు సంబంధించి విభేదాలు బహిరంగ రాజకీయ చర్చగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో షర్మిల జగన్‌పై గతంలో మాదిరిగా తీవ్ర విమర్శలు చేయకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. దీనికి తోడు ఇప్పుడు స్వయంగా జగన్ నివాసానికి వెళ్లి కుమార్తె పెళ్లికి ఆహ్వానించనున్నారనే వార్త మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇద్దరి మధ్య రాజకీయ లేదా కుటుంబ పరమైన రాజీ కుదిరిందని అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.
అసలు ఆసక్తి జగన్ నిర్ణయంపైనే..
ఇక షర్మిల ఆహ్వానం ఇవ్వడం ఒక ఎత్తయితే.. దానికి జగన్ స్పందన ఎలా ఉంటుందనేది మరో ఆసక్తికర అంశం. ముఖ్యంగా అంజిలి రెడ్డి నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరవుతారా? వివాహానికి వెళ్తారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలకు జగన్ దంపతులు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు వైఎస్సార్ కుటుంబ అభిమానులు, వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఆసక్తిని పెంచుతోంది.
రాజకీయాలకు అతీతంగా కుటుంబ బంధం?
వైఎస్ జగన్ ప్రస్తుతం వైసీపీ అధినేతగా, షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వేర్వేరు రాజకీయ మార్గాల్లో ఉన్నారు. రాజకీయంగా ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, కుటుంబ శుభకార్యం మాత్రం వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విజయమ్మ సమక్షంలో షర్మిల జగన్ ఇంటికి వెళ్లడం ఈ పరిణామానికి మరో కోణాన్ని జోడిస్తోంది. ఇది కేవలం పెళ్లి ఆహ్వాన కార్యక్రమంగానే ముగుస్తుందా? లేక కుటుంబ సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఓ అవకాశంగా మారుతుందా? అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం.
అంజిలి రెడ్డి పెళ్లి వైఎస్సార్ కుటుంబంలో ఓ శుభకార్యమే అయినప్పటికీ జగన్–షర్మిల మధ్య సంబంధాల నేపథ్యంలో ఈ వివాహ ఆహ్వానం రాజకీయంగానూ, కుటుంబపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
