Begin typing your search above and press return to search.

చెన్నై ప్ర‌చారానికి ష‌ర్మిల దూరం.. రీజ‌నేంటి?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లను కాంగ్రెస్ పార్టీ కీల‌కంగా తీసుకుంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో త‌న ప‌ట్టును నిల‌బెట్టుకునేందుకు.. ఇదేస‌మ‌యంలో బీజేపీ పుంజుకోకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

By:  Garuda Media   |   20 April 2026 12:00 AM IST
చెన్నై ప్ర‌చారానికి ష‌ర్మిల దూరం.. రీజ‌నేంటి?
X

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లను కాంగ్రెస్ పార్టీ కీల‌కంగా తీసుకుంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో త‌న ప‌ట్టును నిల‌బెట్టుకునేందుకు.. ఇదేస‌మ‌యంలో బీజేపీ పుంజుకోకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అధికార పార్టీ డీఎంకేతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ.. స‌ర్దుబాటు ధోర‌ణి తోనే ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో ప‌లు రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కుల‌కు కూడా ఇక్క‌డ ప్ర‌చారం చేసేందుకు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా అవ‌కాశం క‌ల్పించింది.

వీరిలో తెలంగాణ‌కు చెందిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వంటి వారు ఉన్నారు. అయితే.. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల కూడా వ‌స్తానంటూ.. పార్టీ అధిష్టానానికి వ‌ర్త‌మానం పంపించారు. కానీ.. పార్టీ అధిష్టానం ఆమెను ప‌క్క‌న పెట్టింద‌ని తెలిసింది. నిజానికి ఎన్నిక‌ల పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు.. పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నేరుగా త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి న‌డుం బిగించారు. పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు పూర్తికాగానే ఆయ‌న చెన్నైకి వ‌చ్చి.. మ‌కాం వేశారు.

ఈ స‌మ‌యంలోనేవివిధ రాష్ట్రాల‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను కూడా ఆయ‌న వెంట‌బెట్టుకుని ప్ర‌చారానికి రావ‌డం గ‌మ‌నార్హం. ఈ బ్యాచ్‌లో ష‌ర్మిల‌కు కూడా చోటు ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ, ఆమె పేరును అధిష్టానం ప‌క్క‌న పెట్టింది. దీనికి కార‌ణాలు తెలియాల్సి ఉంది. వాస్త‌వానికి చెన్నైలో ప్ర‌చారం చేస్తాన‌ని.. చెన్నైతో త‌న‌కు అనుబంధం ఉంద‌ని ష‌ర్మిల చెబుతున్నట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. కానీ.. ఆమె ప్ర‌చారాన్ని పార్టీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం మ‌హిళా బిల్లు అంశాన్ని బీజేపీ ప్ర‌ధానంగా ప్ర‌చారం చేసుకుంటోంది. కాంగ్రెస్ స‌హా.. డీఎంకే పార్టీలు ఈ బిల్లుకు అడ్డం ప‌డ్డాయ‌ని.. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ రాకుండా అడ్డుకున్నాయ‌ని.. ప్ర‌ధాని మోడీ ఆదివారం కూడా ప్ర‌చారం చేశారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌హిళా నాయ‌కుల‌తో ప్ర‌చారం చేయించాల‌ని కాంగ్రెస్ భావించినా.. డిల్లీ, పంజాబ్‌, క‌ర్ణాట‌క‌ల నుంచి మ‌హిళా నాయ‌కుల‌ను తమిళ‌నాడుకు తెచ్చారు త‌ప్ప‌.. ష‌ర్మిల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.