షర్మిల తీరుపై... అధిష్టానానికి 20 మంది లేఖ?
గత కొన్నాళ్లుగా ఆమెపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు.. అదే విధంగా మాజీ మంత్రులు.. సైతం ఇప్పుడు తమ గళాన్ని మరింత తీవ్రంగా వినిపించాలని నిర్ణయించారు
By: Garuda Media | 16 April 2026 5:00 AM ISTకాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు అంతర్గతంగా సెగ తగులుతోంది. గత కొన్నాళ్లుగా ఆమెపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు.. అదే విధంగా మాజీ మంత్రులు.. సైతం ఇప్పుడు తమ గళాన్ని మరింత తీవ్రంగా వినిపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా 20 మంది నాయకులు పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెందడం మాట ఎలా ఉన్నప్పటికీ షర్మిల చేస్తున్న రాజకీయాలతో పార్టీ పరువు మరింతగా దెబ్బతింటోందని పేర్కొంటూ ఈ లేఖ సంధించారు.
మాజీ మంత్రిగా వ్యవహరించిన రఘువీరారెడ్డి అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు వంటి సీనియర్ నాయకులు ఈ లేఖను అధిష్టానానికి పంపించారని తెలిసింది. పార్టీని డెవలప్ చేసుకుంటే ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని పార్టీకి సూచించారు. కానీ ఆ దిశగా షర్మిల ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా, పార్టీని మరింత దయనీయ స్థితిలోకి నడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ లేఖలో గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించారు.
జగన్ పై విమర్శలు చేయటం వల్ల కాంగ్రెస్‌కు వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏమి లేకపోగా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారన్న వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోందని.. ఇది పార్టీకి, వ్యక్తిగతంగా నాయకులకు కూడా మంచిది కాదని వారు కీలక సూచన చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని రాజకీయంగా వాడుకోవడం వరకూ పార్టీ పరిమితం కావాలని.. కానీ ఈ విషయంలో షర్మిల తన వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం ద్వారా పార్టీకి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నారని సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు.
వీరిలో మాజీ ఎంపీలు ఇద్దరు ఉండగా నలుగురు కేంద్ర మాజీ మంత్రులు సంతకాలు చేయడం విశేషం. షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకించడం లేదని పేర్కొన్న వీరంతా షర్మిల అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. ఇది పార్టీకి కానీ వ్యక్తిగతంగా ఆమెకు కానీ లాభించే పరిణామంగా కనిపించడం లేదని కేవలం రాజకీయ విమర్శలు చేయడం ద్వారా మీడియాలో హైలెట్ కావాలన్న ఉద్దేశంతో షర్మిల వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అయిపోయిందని ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని డెవలప్ చేసుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.
త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్న క్రమంలో పార్టీని మండల స్థాయి నుంచి డెవలప్ చేసుకునే విధానంపై తాము అనేక సూచనలు చేసినప్పటికీ షర్మిల ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ తరహా రాజకీయాలు గనక కొనసాగితే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, గత ఎన్నికల సమయంలో రెండు శాతం ఓటు బ్యాంకు ను సొంతం చేసుకున్న పార్టీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తే పార్టీకి లాభిస్తుందని పేర్కొన్నారు. అనేక సమస్యలు ఉన్నాయని అటు వైసిపి ఇటు కూటమి పార్టీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్న క్రమంలో దానిని అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీకి అవకాశం ఉందని స్పష్టం చేశారు.
కానీ, ఆ దిశగా షర్మిల ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. ఈ మేరకు 20 మంది నాయకులు తమ సంతకాలతో పార్టీ అధిష్టానానికి లేక పంపారు. ఆమె విధానాన్ని మార్చుకునే దిశగా అధిష్టానం సూచనలు చేయాలని, అందరినీ కలుపుకుని పోయేలాగా సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకునేలాగా ఆదేశించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ లేఖ వ్యవహారం పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
షర్మిల వ్యవహారంపై గత ఎన్నికల తర్వాత అనేక మంది నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే రఘువీరారెడ్డి వంటి సీనియర్లు కొన్ని కొన్ని విషయాలను ప్రస్తావించకుండా ఉంటే బాగుంటుందని ఆమెకు సూచించారు. అయినప్పటికీ షర్మిల మాత్రం తను ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగారు. దీంతో తాను కూడా ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందన్నది సీనియర్లు గత కొన్నాళ్లుగా చెబుతున్నారు. అందతేకాదు.. తనకు నచ్చని వారిపై ఆమె ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి బయటికి వెళ్లి పోయేలాగా ప్రయత్నిస్తున్నారని ఇది సరైన విధానం కాదని వారు సూచిస్తున్నారు. మరి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
