Begin typing your search above and press return to search.

షర్మిల ఫైర్.. "మావిగన్ జోకర్" అంటూ సంచలన వ్యాఖ్యలు!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   9 April 2026 7:21 PM IST
షర్మిల ఫైర్.. మావిగన్ జోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు!
X

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి స్థానంలో మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చిన జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నావంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల ఘాటు వ్యాఖ్యలతో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ రెడ్డి ఉద్దేశించి ‘మావిగన్ జోకర్’ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

వైఎస్ పాదయాత్ర తలచుకుంటూ..

మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన మహా ప్రస్థానం పాదయాత్రను గుర్తు చేస్తూ షర్మిల ట్వీట్ చేశారు. ‘‘ఇవ్వాళ్టికి 23 ఏళ్ళు. ఏప్రిల్ 9, 2003 లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ప్రజాహితమే పరమావధిగా సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర.. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం. కాంగ్రెస్ నాయకుడు, నాన్న YSR ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఇవ్వాళ్టికి పదిలం. 23 ఏళ్లుగా సంక్షేమానికి మహానేత పెట్టిన చెక్కుచెదరని సంతకం. ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించిన అభయహస్తం. రాష్ట్ర దుర్భర పరిస్థితులను అంతమొందించిన స్వర్ణయుగం.’’ అంటూ రాజశేఖరరెడ్డి పాదయాత్రను షర్మిల కీర్తించారు. ఇదే సమయంలో తన సోదరుడు జగన్ రెడ్డి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారసులు ఎవరు?

రాజశేఖరరెడ్డి వారసులుగా చెప్పుకుని జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పేరును వాడుకున్నారు, తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదని షర్మిల ధ్వజమెత్తారు. వైసీపీలో నిజంగా వైఎస్ఆర్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం హోదాలో వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ‘‘మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే, పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి “ఓన్లీ క్యాష్” మాఫియా ఎందుకు చేశారు? వైఎస్ తన జీవిత కాలం వ్యతిరేకించిన BJP కి దత్తపుత్రుడుగా ఎలా మారారు? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇక దేశ వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై ఆర్ఎస్ఎస్ వాదులు దాడులు చేస్తుంటే వైఎస్ వారసుడుగా జగన్ గారు ఎందుకు ఖండించలేదు? అంటూ ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారు. ఇప్పుడు “మావిగన్ జోకర్” గా మిగిలారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

ఇక ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది అంటూ తన తండ్రి చేపట్టిన పాదయాత్రను గుర్తు చేస్తూ జగన్ ట్వీట్ చేశారు. దీనిని రీట్వీట్ చేస్తూ షర్మిల చేసిన కామెంట్స్ రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ‘‘..మరి అటువంటి తండ్రికి కుమారునిగా, పార్టీ పేరులో వైఎస్ పేరును పొందుపర్చి మీరు నేడు చేస్తున్నది ఏమిటి? ఆజన్మాంతం పేదలు, దళితులు, మైనారిటీలు, మహిళలు, రైతులు, ఎస్టీలు, వీరి కోసం తపించి, తన పాలనలో వీరికోసం ఎన్నో పథకాలను రచించిన అయన ఎక్కడ, నేడు ఫాసిస్టు శక్తులకు తలవంచి వాళ్ళ క్యాపిటలిస్టు పోకడలకు దాసోహం అయిన మీరెక్కడ?’’ అంటూ షర్మిల విరుచుకుపడ్డారు. అంతేకాకుండా జగన్ రెడ్డి ప్రకటించినట్లు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శన యాత్ర అంటూ వ్యాఖ్యానించారు.