Begin typing your search above and press return to search.

షర్మిల ఎంపీ సీటుకు మోకాలడ్డుతున్నది ఎవరు ?

వైఎస్సార్ తనయ రాజకీయాల పట్ల అమిత ఉత్సాహం కలిగిన మహిళగా వైఎస్ షర్మిలను చెబుతారు.

By:  Satya P   |   4 Jun 2026 1:17 AM IST
షర్మిల ఎంపీ సీటుకు మోకాలడ్డుతున్నది ఎవరు ?
X

వైఎస్సార్ తనయ రాజకీయాల పట్ల అమిత ఉత్సాహం కలిగిన మహిళగా వైఎస్ షర్మిలను చెబుతారు. ఆమె అన్న వైఎస్ జగన్ ద్వారా రాజకీయాలలో ప్రవేశం చేసినా ఆనక తనకంటూ సొంత రాజకీయ అస్థిత్వం కోసం ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్సార్ టీపీ పేరుతో ఆమె పార్టీని తెలంగాణాలో స్థాపించి రెండేళ్ల పాటు నడిపి ఆనక కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆమెకు దానికి ప్రతిఫలంగా ఏపీసీసీ చీఫ్ పదవిని ఇచ్చారు. షర్మిల వల్ల కాంగ్రెస్ కి మేలు జరిగిందా అంటే కాంగ్రెస్ ఓటు షేర్ ని తన వైపు తిప్పుకున్న వైఎస్ జగన్ ఏపీలో అధికారం నుంచి దిగిపోవడమే షర్మిల సాధించిన ఘన విజయంగా చెప్పాలి. కనీసం ప్రతిపక్ష స్థానానికి అవసరం అయిన 18 సీట్లు కూడా వైసీపీకి రాలేదు అంటే షర్మిల ప్రభావం రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో బాగానే పనిచేసింది అని విశ్లేషించారు. ఈ కారణంగానే కొన్ని సీట్లలో తక్కువ మెజారిటీ తేడాతో కూడా వైసీపీ ఓటమి పాలు అయిందని గుర్తు చేస్తారు.

వైసీపీ వీక్ అయింది మరి :

ఆ విధంగా చూస్తే ఈ రోజున వైసీపీ అసెంబ్లీకి వెళ్ళలేకపోవడానికి కూడా కాంగ్రెస్ కి నాయకత్వం వహించిన షర్మిల చేసిన ప్రచారం దాని వల్ల వైసీపీకి వచ్చిన అతి తక్కువ సీట్లే కారణం అని చెప్పాల్సి ఉంటుంది. మరి పరోక్షంగా కాంగ్రెస్ కి ఎంతో కొంత ఇది మేలు చేసే వ్యవహారమా కాదా ఆంట అది ముందు ముందు తెలుస్తుంది. కానీ షర్మిల ప్లేస్ లో ఎవరు ఉన్నా వైసీపీ ఇంత ఘోరంగా ఓటమి పాలు అయ్యేది కాదన్న చర్చ అయితే ఉంది. మరి ఇంత చేసిన షర్మిలకు కాంగ్రెస్ అధినాయకత్వం రాజ్యసభ సీటు ఇస్తామని విలీనం సమయంలో చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా అని కూడా అంటున్నారు.

రాజ్యసభ ఖాయమంటూ :

ఇక కర్ణాటకలో రాజ్యసభ సీట్లు నాలుగు దాకా ఖాళీ అవుతున్నాయి. అందులో ఒక సీటుని షర్మిలకు ఇస్తారని ప్రచారం అయితే ఊపందుకుంది. ప్రత్యేకించి రాహుల్ గాంధీ పిలిపించుకుని మరీ షర్మిల దంపతులతో చర్చించారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో కేంద్ర పెద్దల వద్ద ఓకేగా ఉన్నా కూడా కర్ణాటకలో స్థానికంగా మాత్రం రాజ్యసభ సీటుని షర్మిలకు ఇవ్వడం మీద అయితే అక్కడి కాంగ్రెస్ నేతల మధ్య వర్గాల మధ్య రచ్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరో రెండేళ్ళలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో పలువురు సీనియర్లు ఆశావహులు రాజ్యసభ రేసులో ఉన్నారు. ఉనన్ సీట్ల కంటే అయిదారు రెట్లు ఆశావహులు ఉండడంతో తలనొప్పి వ్యవహారంగా మారింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో సామాజిక ప్రాంతీయ రాజకీయ సమీకరణలు సరి చూడాల్సిన అవసరం ఉంది. అంతే కాదు మాజీ సీఎం సిద్దరామయ్య సిఫార్సులు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

సారీ చెబుతారా లేక :

ఈ రకమైన టైట్ ఫైట్ మధ్య అనేక రాజకీయ పరమైన అనివార్యతల మధ్యన పొరుగున ఉన్న షర్మిలకు రాజ్యసభ టికెట్ ఇస్తే కర్ణాటక కాంగ్రెస్ లో రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం సాగుతోంది. తమకే సీట్లు లేకపోతే తామే నిరాశ పడితే వేరే రాష్ట్రానికి చెందిన వారికి ఇంత టైట్ పొజిషన్ లో ఇవ్వడం అవసరమా అన్న చర్చ కూడా లేవదీస్తున్నారు అని అంటున్నారు. దాంతో పాటు మరోసారి కాంగ్రెస్ కర్ణాటకలో గెలవడం ముఖ్యం కాబట్టి సీనియర్లు అసంతృప్తి చెందకూడదనే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాంతో షర్మిలకు సీటు ఇస్తే వారంతా ఊరుకుంటారా హైకమాండ్ గట్టిగా ఈ విషయంలో పట్టుబడుతుందా లేక డీకే తాను కొత్తగా సీఎం అయిన తరువాత ఈ తలనొప్పులు ఎందుకు అని తమ సొంత రాష్ట్రానికి చెందిన వారికే రాజ్యసభ సీట్లు ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఈ అడ్డంకులు అన్నీ దాటుకుని షర్మిల రాజ్యసభ సాధిస్తే మాత్రం ఆమె గ్రేట్ అని చెప్పాల్సిందే అంటున్నారు. అంతే కాదు కాంగ్రెస్ హైకమాండ్ నిండు దీవెనలు ఆమెకు ఉన్నాయని కూడా భావించాలని అంటున్నారు.