షర్మిలక్క చట్ట సభలోకి ఎపుడు ?
అయితే ఇపుడు అలాంటివి అయితే అసలు కనిపించడం లేదు అని అంటున్నారు. పైగా ఏపీలో పార్టీ ఏమీ లేని చోట ఈ కీలక పదవిని ఇచ్చినా ఉపయోగం ఏమిటి అన్న చర్చ కూడా ఉందిట.
By: Tupaki Desk | 17 April 2025 12:00 AM ISTవైఎస్సార్ కి ఓటమి లేదు. ఆయన ప్రజా నాయకుడిగా స్వయంగా ఎదిగారు. దాదాపుగా మూడున్నర దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీలో తనదైన రాజకీయం చేసి బలమైన ముద్ర వేసుకున్నారు. వైఎస్సార్ వారసులు కూడా అంతే శక్తిమంతులు అని అంతా అనుకుంటారు.
అలా చూస్తే కనుక ఓటమి ఈ రోజుకీ దరిచేరకుండా మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా గెలిచి ఏపీకి అయిదేళ్ళ పాటు సీఎం గా పనిచేసిన వారు వైఎస్ జగన్. ఆయన రాజకీయం 2024 తరువాత కొంత ఒడిదుడుకు ఎదుర్కొంటున్నా ఉందిలో మంచికాలం ముందు ముందునా అని ధీమాతో సాగుతున్నారు.
ఇక అన్న పెట్టిన పార్టీలో తనకు చోటు దక్కకపోవడంతో తెలంగాణాలో తండ్రి పేరుతోనే పార్టీ పెట్టి గట్టిగా మూడేళ్ళు కూడా పోరాడకుండానే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి వచ్చారు వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల. సరిగ్గా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు.
ముల్లును ముల్లుతోనే తీయాలన్న కాంగ్రెస్ రాజనీతిని ఆమె ఆచరణలో అమలు చేసి చూపించారు. వైసీపీని ఏపీ పీఠం మీద నుంచి దించేయగలిగారు. ఆ విధంగా పాక్షిక విజయం సాధించారు. అదే టైం లో ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచలేకపోయారు. తాను స్వయంగా పోటీ చేసిన కడప లోక్ సభ సీటు నుంచి గెలవలేకపోయారు.
అలా తొలిసారి పోటీలోనే ఓటమిని అందుకున్న షర్మిలకు గడచిన పది నెలల కాలంలో పార్టీని ఏ దారిలో నడిపించాలో అర్ధం కావడం లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు అంతా సైలెంట్ అయ్యారు. ఓపిక ఉన్నవారు వేరే ఆప్షన్లు చూసుకుంటున్నారు. దాంతో షర్మిల మీడియా మీటింగులు తప్పించి పార్టీని బలోపేతం చేసే దిశగా జనంలోకి రావడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మరో నాలుగేళ్ళ పాటు ఏపీలో కాంగ్రెస్ బండిని నడిపించాల్సి ఉంది. పార్టీ చూస్తే నిస్తేజంగా ఉంది. ఏపీలో 2029లో అధికారంలోకి వస్తామన్న ఆశలు కూడా కాంగ్రెస్ కి లేవు ఇక షర్మిల చట్టసభ లోకి అడుగుపెట్టాలన్న ఆశలు కూడా ఇప్పట్లో తీరేవి కావు అని అంటున్నారు ఆమె కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసినపుడు రాజ్యసభకు పంపుతామని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం హామీ ఇచ్చిందని ప్రచారం అయితే సాగింది.
అయితే ఇపుడు అలాంటివి అయితే అసలు కనిపించడం లేదు అని అంటున్నారు. పైగా ఏపీలో పార్టీ ఏమీ లేని చోట ఈ కీలక పదవిని ఇచ్చినా ఉపయోగం ఏమిటి అన్న చర్చ కూడా ఉందిట. కాంగ్రెస్ లో ఎంతో మంది అతిరధ మహారధులు రాజ్యసభ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఆ పార్టీకి రాజ్యసభ సీట్లు పరిమితంగా ఉంటాయి. దాంతో షర్మిల వరకూ చూస్తే ఏపీలో 2029 దాకా పార్టీని పంటి బిగువన నడిపించడం అలా సానుకూలత కలుగచేసి తానూ ఒక సీటు చూసుకుని పోటీ చేయడం చేయాలి. వీలు ఉంటే సరైన పొత్తులు కలిపి తన సీటు వరకు అయినా గెలుపు ఆశలు ఉండేలా జాగ్రత్త పడాలి.
ఏపీలో చూస్తే బీజేపీతో జట్టుకట్టి ఉన్న టీడీపీ కాంగ్రెస్ తో కలుస్తుంది అని ఎవరూ అనుకోవడం లేదు ఇక వైసీపీ ఎటూ బద్ధ శత్రువుగా ఉంది. సో వామపక్షాలు తప్పించి కాంగ్రెస్ కి మిత్రులు ఎవరూ ఏపీలో లేరు అని అంటున్నారు. ఇలా ఒక దారీ గమ్యం లేని నడకలా షర్మిల కాంగ్రెస్ ప్రయాణం ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. పోనీ వేరే ఏదైనా రాజకీయ బాట పట్టాలన్నా కూడా అది కూడా సాధ్యపడేలా లేదు. మొత్తానికి జగన్ చెల్లెమ్మగా ఆయన వదిలిన బాణంగా జనంలోకి వచ్చిన షర్మిల తన రాజకీయం గురించి ఆలోచించుకుని ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తారు అన్నది మాత్రం ఆసక్తికరమే అని అంటున్నారు.
