షర్మిల కమిటీలు.. కాలయాపనేనా .. !
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వైఎస్ షర్మిల పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
By: Garuda Media | 25 Sept 2026 11:00 AM ISTఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వైఎస్ షర్మిల పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమె పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఒకవైపు కుమార్తె అంజలి వివాహ వేడుకల్లో బిజీగానే ఉన్నప్పటికీ.. మరోవైపు రాజకీయంగా పార్టీపై తన పట్టు నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమం లోనే షర్మిల కొత్తగా కమిటీలను ఏర్పాటు చేశారు.
అయితే.. ఈ కమిటీలు ఇప్పటి వరకు చార్జి తీసుకోకపోవడతో ఇవి కాలయాపన కోసం వేసిన కమిటీలా? లేక.. నిజం గానే పనిచేస్తున్నాయా? అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన షర్మిల.. దీనికి కీలక బాధ్యతలు అప్పగించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇటీవల సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్. రఘువీరారెడ్డి ఛైర్మన్‌గా 10 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ఎన్నికల విధివిధానాలు, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి సమన్వయాన్ని పర్యవేక్షించాలన్నది షర్మిల పెట్టుకున్న లక్ష్యం. అయితే.. ఇప్పటి వరకు రఘువీరా రెడ్డి బాధ్యతలు చేపట్టిన పరిస్థితి కనిపించలేదు. .క్షేత్రస్థాయి పర్యటనలు - సమీక్షలు కూడా చేయడం లేదు. ముఖ్యంగా గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ఏకైక అజెండాగా పనిచేయాలని ఆమె జిల్లా, నగర కమిటీలకు దిశానిర్దేశం చేశారు. ఆయా కమిటీలు రఘువీరా కమిటీతో కలిసి పనిచేయాలన్నారు.
కానీ, ఆ తరహా పరిస్థితి కనిపించడం లేదు. వివిధ జిల్లాల్లో (ఉదాహరణకు నంద్యాల) పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాల్లో ఆధిపత్య దోరణి కొట్టొచ్చినట్టు కనిపించింది. స్థానిక పరిస్థితులు అర్ధం చేసుకోవాలని నాయకులు కోరుతున్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టలో ఉన్న కొందరికి అన్యాయం చేస్తున్నారని.. మెజారిటీ నాయకులు చెబుతున్నారు. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుతున్న వారు మరికొందరు ఉన్నారు. ఇలా.. కమిటీలు వేసినా.. అవి పనిచేయక పోవడం.. క్షేత్రస్థాయి నాయకత్వంలో ఆధిపత్య ధోరణులు పెరగడం వంటివి చర్చకు దారి తీస్తున్నాయి.
