ఏపీ కాంగ్రెస్ కి యూత్ ఫోర్స్...బస్తీమే సవాలేనా !
మరో వైపు చూస్తే కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను చూసిన సీనియర్లు చాలా మంది సైలెంట్ అయ్యారు.
By: Tupaki Desk | 15 April 2025 6:32 PM ISTఏపీలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అని వెతుక్కోవాల్సిన దురవస్థలో ఉంది. వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సంగతి దేవుడెరుగు తొంబై శాతం డిపాజిట్లు పోగొట్టుకుంది. ఏపీలో 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లు ఉంటే కాంగ్రెస్ కనీసంగా పోటీ ఇచ్చే సీన్ ఎక్కడా లేదు అని ఈ మూడు ఎన్నికలూ రుజువు చేశాయి. కనీసం సెకండ్ పొజిషన్ లో కూడా ఆ పార్టీ నిలవలేదు.
ఇక 2024 ఎన్నికల ముందు వైఎస్సార్ బ్లడ్ అని వైఎస్ షర్మిలను తెచ్చి పీసీసీ కిరీటం పెట్టారు. అయినా ఆ పార్టీ ఏ మాత్రం పుంజుకోలేకపోయింది. ఇక షర్మిల లక్ష్యం వేరుగా ఉంది అన్న విమర్శలు ఉన్నాయి. ఆమె ఎంతసేపూ జగన్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంతసేపూ ఆమె తీసుకున్న పొలిటికల్ స్టాండ్ కరెక్టే అయినా వన్స్ జగన్ మాజీ సీఎం అయ్యాక ఇంకా ఆయన మీదనే బాణాలు గురి పెట్టడం మాత్రం కాంగ్రెస్ కి కలిసి రావడం లేదు.
దాంతో గత పది నెలలుగా చూసుకుంటే కాంగ్రెస్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అగ్రెసివ్ గా పోరాటం చేస్తారని షర్మిలను పీసీసీ చీఫ్ గా చేస్తే ఆమె వైసీపీ మీద మాత్రమే పోరాటం చేస్తున్నారు. ఏపీలో తొలిసారిగా ఏర్పాటు అయిన ఎన్డీయే ప్రభుత్వం మీద కాంగ్రెస్ సమర్ధవంతంగా పోరాటం చేయడం లేదు అన్న చర్చ అయితే సాగుతోంది.
మరో వైపు చూస్తే కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను చూసిన సీనియర్లు చాలా మంది సైలెంట్ అయ్యారు. షర్మిల పీసీసీ చీఫ్ అయిన కొత్తలో ఆమె వెంట కనిపించిన వారు కూడా ఇపుడు కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ అంటేనే వృద్ధ నేతలు అన్నది కూడా అంతా అంటున్న మాట.
కాంగ్రెస్ కి ఏపీలో వారు అభిమానంగా ఉంటున్నారు తప్ప తమ సేవలను అందించలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. కాంగ్రెస్ కి కొత్త నెత్తురు ఎక్కించాలని చూస్తోంది. కాంగ్రెస్ కి యూత్ ఫోర్స్ ని జత చేస్తే కనుక పార్టీ స్ట్రాంగ్ గా ఉంటుందని ఏపీలో కూటమిని అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని గట్టిగా ఎదుర్కొంటుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారుట.
పార్టీలో షర్మిలను కొనసాగించాలనే పార్టీ పెద్దలు అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే వైఎస్సార్ వారసురాలిగా కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ ని వైసీపీ నుంచి ఎంతో కొంత బదిలీ చేయగల కెపాసిటీ ఆమెకే ఉందని ఆమెకు ఆ పొలిటికల్ గ్లామర్ కూడా ఉందని పెద్దలు నమ్ముతున్నారుట.
ఇక షర్మిలతో విభేదిస్తున్న సీనియర్లను అలాగే ఉంచి యువతకు కనుక అవకాశం ఇస్తే వారు అంతా కలసి షర్మిలతో పోరాటాలు చేస్తే ఏపీలో కాంగ్రెస్ కి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారుట. దాంతో కాంగ్రెస్ లో కీలకమైన పదవులు కానీ అవకాశాలు కానీ ఇక మీదట యువతకే ఇవ్వాలని హైకమాండ్ గట్టిగా డిసైడ్ అయింది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఇటీవల గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాలలో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ అయిన మాణికం ఠాగూర్ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల గురించి గంటకు పైగా చర్చించారు అని అంటున్నారు. పార్టీ నాయకులతో ఆయన ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేయడం మీదనే ఫోకస్ పెట్టాలని కోరారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పెద్దల ఆలోచను చూస్తే తొందరలోనే భారీ ప్రక్షాళన దిశగా ఏపీ కాంగ్రెస్ ఉండబోతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఆ మార్పులు కాంగ్రెస్ ని ఏ తీరానికి చేరుస్తాయో.