Begin typing your search above and press return to search.

షర్మిల సొంత అజెండాపై విమర్శలు.. కాంగ్రెస్ హైకమాండ్ స్పందన ఏంటంటే..?

పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకున్న నుంచి కాంగ్రెస్ లో అన్నీతానై వ్యవహరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Jun 2025 11:26 AM IST
షర్మిల సొంత అజెండాపై విమర్శలు.. కాంగ్రెస్ హైకమాండ్ స్పందన ఏంటంటే..?
X

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పనితీరుపై కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తే ఆమె తన సొంత రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఇటీవల కాలంలో ఏపీసీసీ చీఫ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పార్టీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి ఇదే కారణమంటూ ఆరోపించారు. ఆస్తుల పంపకాలు, ఇతర కుటుంబ వివాదాలతో తన అన్న జగన్ పై షర్మిల రాజకీయ యుద్ధం చేస్తున్నారని పార్టీలో ఓ వర్గం ఆక్షేపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగిందని అంటున్నారు. షర్మిల వైఖరిపై కాంగ్రెస్ హైకమాండ్ స్పందనే ఆ పార్టీ విధానంగా భావిస్తున్నారు.

పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకున్న నుంచి కాంగ్రెస్ లో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఆమె మెయిన్ వాయిస్గా మారిపోయారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ పై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్న షర్మిల.. అధికార కూటమిలోని టీడీపీ, జనసేనపై మెతక వైఖరి వహిస్తున్నారని కాంగ్రెస్ వాదుల్లో చర్చ జరుగుతోంది. అయితే జగన్ ను బలహీనపరిస్తేనే కాంగ్రెస్ బలపడుతుందనే ఆలోచనతో పార్టీ చీఫ్ ముందుగా వైసీపీని టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే షర్మిల ఆలోచన ఏదైనప్పటికీ కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ కూడా ఆమెకు పెద్దగా సహకరించడం లేదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లు కొందరు పార్టీని వీడుతుండటం, షర్మిల పనితీరుపై విమర్శలు గుప్పిస్తుండటంతో రాష్ట్ర పార్టీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ రంగంలోకి దిగారు.

జగన్ టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారనే విమర్శలకు చెక్ పెడుతూ పార్టీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ సైతం మాజీ సీఎంపైన, వైసీపీపైన హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ట్విటర్ వేదికగా మాణిక్యం ఠాగూర్ చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి. దేశంలోనే అత్యంత అవినీతిపరుడుగా మాజీ సీఎం జగన్ ను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. అంతేకాకుండా ఇటీవల రెంటపాళ్ల పర్యటనకు జగన్ వెళ్లడాన్ని ప్రస్తావించిన మాణిక్యం ఠాగూర్, ఆ పర్యటనలో ఇద్దరు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ జగన్ తీవ్ర నేర స్వభావం ఉన్న వ్యక్తిగా ఆరోపించారు. కుట్రపూరిత రాజకీయాలు చేయడంలో జగన్ నేర్పరి అంటూ మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

మద్యం కుంభకోణంపైనా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి స్పందన చూస్తే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అనుసరిస్తున్న వైఖరికి పచ్చజెండా ఊపినట్లే భావించాల్సివుంటుందని అంటున్నారు పరిశీలకులు. షర్మిలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ చెబుతూ ఆమెను పార్టీ హైకమాండ్ వెనకేసుకు రావడం చూస్తే.. షర్మిల ఊహిస్తున్నట్లు వైసీపీని దెబ్బతీసి ఆ స్థానంలోకి వెళ్లాలనే కాంగ్రెస్ వ్యూహంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అవసరమని భావిస్తున్న కాంగ్రెస్.. వైసీపీలోని కీలక నేతలను తిరిగి చేర్చుకోవాలని ఎత్తుగడులు వేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ బ్రాండ్ కోసం షర్మిలను రంగంలోకి దించినా, ఇంతవరకు సత్ఫలితాలు సాధించలేకపోయిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బలపడాలనే కాంగ్రెస్ ఆకాంక్ష ఎలా నెరవేరుతుందో చూడాల్సివుందని అంటున్నారు.