Begin typing your search above and press return to search.

జగన్ డెసిషన్ బూమరాంగ్ అవుతోందా ?

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే వెనక్కి వెళ్ళారు అని అంటారు.

By:  Satya P   |   15 Feb 2026 5:00 AM IST
జగన్ డెసిషన్ బూమరాంగ్ అవుతోందా ?
X

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే వెనక్కి వెళ్ళారు అని అంటారు. మరి ఆ సంగతి పక్కన పెడితే అసెంబ్లీకి జగన్ ఆయన ఎమ్మెల్యేలు హాజరయ్యే విషయంలో మాత్రం పట్టుదలగానే ఉన్నారని అంటున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వెళ్తామని వైసీపీ అధినేత అంటున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా లేవని అధికార పక్షం చెబుతోంది. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా చూపిస్తోంది. అయితే దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నామని వైసీపీ అంటోంది. ఈలోగా ఇరవై నెలలు గడచిపోయాయి. అంటే మూడవ వంతు అన్న మాట.

ప్రజలు కోరుకునేది అదే :

నిజానికి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అసెంబ్లీకి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. వారిని గెలిపించేది ప్రజలు ఎమ్మెల్యేగానే. వారు మంత్రి అవుతారా లేక ముఖ్యమంత్రి అవుతారా లేదా ప్రతిపక్ష నేత అవుతారా అన్నది ప్రజలు ఎవరూ ఆలోచించి ఓటేయరు. ఒక వేళ వారు కీలక స్థానాలలోకి వెళ్ళినా వారు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగానే ఉంటారు. హోదా వల్ల వారికి అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉండొచ్చు కానీ బేసికల్ గా అయితే తమ ఎమ్మెల్యే నియోజకవర్గం సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తారని ఓటేస్తారని వారు ఆశిస్తారు. మరి ఎమ్మెల్యేగా గెలిచిన వారు సభకు వెళ్లకపోతే ప్రజా తీర్పునకు మూల నిర్వచనానికీ కూడా విఘాతం కలుగుతుందని మేధావులు అంటున్నారు.

అసెంబ్లీకి దూరం ఎందుకు :

వైసీపీ విషయానికి వస్తే తమకు అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ ఇవ్వరని అంటోంది. సభకు వస్తే తాము తప్పకుండా అవకాశం ఇస్తామని స్పీకర్ చెబుతూ వస్తున్నారు. మరి అది ఏమిటో తెలియాలీ అంటే తప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ వైసీపీ మాత్రం హాజరు కావడం లేదు. జగన్ వరకూ చూసుకుంటే ఆయన వెళ్లకపోయినా తన ఎమ్మెల్యేలను అయినా సభకు పంపించాల్సి ఉంది అని అంటున్నారు. ఇరవై నెలల కూటమి పాలనలో ఎన్నో ప్రజా సమస్యల మీద విపక్షంగా వైసీపీ ప్రశ్నించాల్సి ఉంది. అలా అసెంబ్లీ నుంచి ప్రశ్నిస్తే దానికి వచ్చే మైలేజ్ కానీ జనాల నుంచి వచ్చే స్పందన కానీ వేరు అని అంటున్నారు.

అవమానాలు తప్పవా :

ఇక వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తే అవమానిస్తారు అన్నది కూడా ఉంది. అలా అవమానిస్తే వాటిని ఫేస్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అంటున్నారు అపుడే జనంలో సానుభూతి అయినా పెరుగుతుంది అని అంటున్నారు. గతంలో చంద్రబాబుని వైసీపీ వారు నిండు అసెంబ్లీలో చేసిన కామెంట్స్ వల్లనే ఆయన సభకు ఇంకా రెండేళ్ళు సమయం ఉండగా నమస్కారం పెట్టి బయటకు వెళ్ళారు తిరిగి సీఎం అయ్యారు. అందువల్ల ఈ రోజు అవమానం రేపటి రోజున అధికారం అన్నది ఎన్నో సార్లు రుజువు అయింది. అయినా ప్రజల కోసం అవమానం పడతామని వైసీపీ నిర్ణయించుకుంటే ఆ లెక్కే వేరు అని అంటున్నారు.

రాంగ్ అవుతోందిగా :

వైసీపీ సభకు దూరంగా ఉండడం రాంగ్ డెసిషన్ గానే అంటున్నారు. వైసీపీలోనూ దీని మీద అంతర్గతంగా మధనం జరుగుతోంది కానీ ఎవరూ బయటకు ఏమీ అనలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. రాజకీయాలు అన్నవి ప్రజలకు సంబంధించినవి. వాటిని ప్రజా కోణంలో నుంచే చూడాలి. వారి ఆలోచనలనే నాయకులు పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విధంగా ఆలోచిస్తే వైసీపీ బంగారం లాంటి బడ్జెట్ సెషన్ అవకాశాలని వదులుకుంటోంది అని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ పునరాలోచన చేస్తే బాగుంటుంది అన్న సూచనలు వెలువడుతున్నాయి. కానీ అలా జరుగుతుందా అంటే ఏమో వేచి చూడాల్సిందే.