జగన్ ను విడిచిపెట్టని కాంగ్రెస్.. రెండోసారి మాణిక్కం హాట్ కామెంట్స్
జగన్ చెల్లెలు షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య రాజకీయ, ఆర్థిక, కుటుంబపరమైన విభేదాలు ఉన్నాయని కూడా అందరికీ తెలిసిన విషయం.
By: Tupaki Desk | 14 Aug 2025 11:00 PM ISTవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. అధికార పార్టీ అక్రమాలు, అవినీతని వదిలేసి కాంగ్రెస్ పార్టీ తనను టార్గెట్ చేయడమేంటని బుధవారం మాజీ సీఎం జగన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య హాట్ లైన్ చర్చలు జరుగుతుంటాయని కూడా జగన్ వ్యాఖ్యానించారు. అయితే జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తమ పార్టీని టార్గెట్ చేసిన మాజీ సీఎం జగన్ కు కౌంటర్ ఇవ్వడమే కాకుండా రాజకీయంగా ఆయనను ఇరకాటంలో పడేసే ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
జగన్ చెల్లెలు షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య రాజకీయ, ఆర్థిక, కుటుంబపరమైన విభేదాలు ఉన్నాయని కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే జగన్ కాంగ్రెస్ అగ్రనేతను టార్గెట్ చేస్తే, తాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెప్పిన కాంగ్రెస్, జగన్మోహనరెడ్డికి దమ్ముంటే తమ పార్టీతో కలిసి రావాలని కోరడం ఆసక్తి రేపింది. అంతేకాకుండా పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొనాలని కోరడం కూడా చర్చకు దారితీసింది. ఇక ఇదే అంశంపై రెండో రోజు కూడా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
చంద్రబాబు, రాహుల్ మధ్య హాట్ లైన్ చర్చలు జరుగుతున్నాయన్న విమర్శలను ఉటంకిస్తూ హాట్ లైన్ వ్యవహారాలకు కేంద్ర బిందువు వైసీపీ పార్టీనే అంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ అనేక సార్లు హాట్ లైన్ సంభాషణలు జరుపుతుంటారని చెప్పుకొచ్చారు. తమకు, తమ నాయకుడు రాహుల్ కు హాట్ లైనుతో పనిలేదని వ్యాఖ్యానించారు. ఏదైనా ధైర్యంగా ప్రశ్నించే తత్వం తమకు మాత్రమే ఉందన్నారు మాణిక్కం ఠాకూర్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయ్యారన్న తమ విమర్శలకు మద్దతిచ్చే ధైర్యం జగన్ కు ఉందా? అంటూ నిలదీశారు.
జగన్ గురించి, ఏపీలో అవినీతి, అక్రమాల గురించి మాట్లాడే ధైర్యం తమ పార్టీ నాయకురాలు రష్మిలకు మాత్రమే ఉందన్నారు. స్వప్రయోజనాల కోసం జగన్ ఎంతకైనా దిగజారుతాడని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయిన వారిని జగన్ వదిలేసి, తమపై పడ్డారని మండిపడ్డారు. జగన్ అవినీతి, అక్రమాలు, లిక్కర్ కుంభకోణాన్ని ప్రశ్నిస్తుండటం వల్లే తనపై విమర్శలు చేస్తున్నారని, ఇది నిజం కాకపోతే ఎందుకు భయపడుతున్నారని ఎదురు ప్రశ్నించారు. జగన్ తన పద్దతి మార్చుకోకపోతే, తాము మరింతగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
