"ప్రతి రైతు వైసీపీ పాలన గుర్తు చేసుకుంటున్నాడు".. వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు
మెంథా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పరామర్శించారు.
By: Tupaki Desk | 4 Nov 2025 6:38 PM ISTమెంథా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పరామర్శించారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో ఈ రోజు జగన్ పర్యటించారు. రైతుల పరిస్థితిని చూసి చలించిపోయిన జగన్, కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ సీఎం ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఉన్నాడనే భరోసా ఉండేదని, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంలో ఎరువులను బ్లాకులో కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ-క్రాప్ ద్వారా ప్రతి రైతుకు లాభం చేకూరేలా పనిచేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో రైతుల చేయి పట్టుకుని ముందుకు నడపామని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించేందు కోసం రూ.7,800 కోట్లతో గిట్టుబాటు ధర కల్పించాం, రూ.3 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు జగన్ తెలిపారు.
తమ ప్రభుత్వంలో 85 లక్షల మందికి బీమా కల్పించేలా ప్రీమియం చెల్లించామని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కేవలం 19 లక్షల మందికి మాత్రమే బీమా చెల్లించారని ఆయన ఆరోపించారు. రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదని ఆరోపించారు.
కాగా, కృష్ణా జిల్లాలోని మొంథా తుఫానుతో పంటలు దెబ్బతిన్న రామరాజుపాలెం గ్రామానికి చెందిన రైతులను జగన్ పరామర్శించారు. తుఫాను ధాటికి తడిసిపోయిన వరికుంకులను ప్రత్యక్షంగా చూశారు. ఇప్పటివరకు ప్రభుత్వం పంట నష్టం అంచనా వేయలేదని రైతులు మాజీ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో రైతులను ఓదార్చిన మాజీ సీఎం జగన్ ప్రభుత్వం న్యాయం చేసేవరకు రైతుల తరఫున పోరాటం చేస్తానని ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మొంథా తుఫాన్ వల్ల 25 జిల్లాల్లోని 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు పాలనలోని 18 నెలల పాలనలో 16 విపత్తులు వచ్చాయని తెలిపారు.
