Begin typing your search above and press return to search.

సింగయ్య మృతి కేసు... వైఎస్ జగన్ కీలక నిర్ణయం!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సింగయ్య మృతి కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Jun 2025 3:57 PM IST
సింగయ్య మృతి కేసు... వైఎస్  జగన్  కీలక  నిర్ణయం!
X

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సింగయ్య మృతి కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. దీని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. పైగా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఏ2గా చేర్చుతున్నట్లు గుంటూరు ఎస్పీ వెల్లడించినప్పటి నుంచీ వ్యవహారం మరింత గాలివానగా మారింది.

వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ కింద పడి.. సింగయ్య అనే వ్యక్తి మరణించినట్లు వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే.. జగన్ తో పాటు ఆయన డ్రైవర్, పీఏ తో పాటు పలువురు వైసీపీ నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా హైకోర్టును ఆశ్రయించారు.

అవును... సింగయ్య మృతి కేసులో జగన్ ను ఏ2గా చేర్చడంతోపాటు, ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మంగళవారం రాత్రి నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు! దీంతో వ్యవహారం ఒక్కసారిగా మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు.

అయితే... నేడు ఈ పిటిషన్ ను విచారించేందుకు కోర్టు అంగీకరించలేదు. రేపు (26 జూన్ - గురువారం) విచారన జరుపుతామని స్పష్టం చేసింది. ఈ సమయంలో జగన్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ, డ్రైవర్‌ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌ రెడ్డి క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు!

కాగా.. సింగయ్య జగన్‌ వాహనం కింద పడినట్టు వీడియోలో ఉందని గుంటూరు ఎస్పీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయలో... సీసీ టీవీ ఫుటేజ్‌, డ్రోన్‌ దృశ్యాలు, ఘటనా స్థలంలో తీసిన వీడియోలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జగన్ ను ఈ కేసులో ఏ2గా చేర్చారు.

మరోవైపు జగన్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ప్రత్తిపాడు సీఐ, తాడేపల్లి సీఐ, నల్లపాడు ఎస్‌.ఐ. కలిసి.. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో... ఇద్దరు వీఆర్వోల సమక్షంలో పంచనామా చేసి ఆ పత్రాన్ని వైసీపీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి అందించారు. అనంతరం.. ఏపీ 40 డీహెచ్‌ 2349 ఫార్చూనర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.