జగన్ సంప్రదాయం అదిరె.. భారతమ్మ పక్కనుంటే మరింత బాగుండేది
తనను తన రాజకీయ ప్రత్యర్థులు ఏ సమయంలో.. ఏ రీతిలో ఎలా టార్గెట్ చేస్తారన్న దానిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్పష్టత ఎక్కువ.
By: Garuda Media | 26 Feb 2026 12:00 AM ISTతనను తన రాజకీయ ప్రత్యర్థులు ఏ సమయంలో.. ఏ రీతిలో ఎలా టార్గెట్ చేస్తారన్న దానిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్పష్టత ఎక్కువ. అందుకే సందర్భానికి తగ్గట్లు ఆయన తన వ్యూహాల్ని మార్చేస్తుంటారు. తనను టార్గెట్ చేసేందుకు తనకున్న ఇబ్బందుల్ని వ్యూహాత్మకంగా తెర మీదకు తెచ్చే వారికి.. మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇవ్వటం కనిపిస్తుంది.
ఇటీవల కాలంలో తిరుమల లడ్డూ వివాదం అంతకంతకూ ముదురుతోంది. నెయ్యిలో నెయ్యి లేదన్న మాటతో పాటు.. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందన్న దానిపై విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గడిచిన నాలుగైదు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువగా రాజకీయం దేవుడి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఈ సందర్భంగా తనపై విరుచుకుపడుతున్న అధికారపక్షంతో పాటు.. తనను ఇరుకున పెట్టేలా చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ తాజాగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం పరిధిలోని నందిపల్లి నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి సంప్రదాయ దుస్తుల్ని ధరించి.. స్వామివారికి భక్తి శ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. నూత విగ్రహ ప్రతిష్ఠ.. కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన వారిని జగన్ అభినందించారు. తన సంప్రదాయ దుస్తులతో అందరిని ఆకర్షించిన జగన్.. పూజ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించిటం చూస్తే.. హిందూ సంప్రదాయ పూజలకు ఆయన ఎంత ఫ్రాధాన్యతను ఇస్తారన్నది కొట్టొచ్చినట్లుగా కనిపించే పరిస్థితి.
ఇదంతా బాగానే ఉన్నా.. ఒక్క లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. సాధారణంగా హిందూ ధర్మంలో భర్తతో పాటు భార్య కలిసి పూజల్లో పాల్గొనటం కనిపిస్తుంది. తాజాగా దేవాలయ నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి తన సతీమణి భారతమ్మను వెంట పెట్టుకొని వచ్చి.. తనతో పాటు పూజాధికాలు నిర్వహించేలా చేస్తే మరింత బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయాన్నే తీసుకుంటే.. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు.. పూజలకు కానీ తన వెంట తన సతీమణిని వెంట పెట్టుకు రావటమే కాదు.. హిందూ సంప్రదాయం ప్రకారం క్రతువులు నిర్వహిస్తుంటారు. విదేశీయురాలు అందునా అన్యమతానికి చెందిన వారైనప్పటికీ.. తన భర్త అనుసరించే హిందూమతాన్ని ఆమె ఫాలో అయ్యేలా ఆమె తీరు అకట్టుకునేలా ఉంటుంది. అదే రీతిలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన వెంట తన సహధర్మచారిణిని తీసుకెళితే.. భేషుగ్గా ఉంటుదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తుడటం గమనార్హం.
