జగన్ నోట.. 'జాకీ' మాట.. ఏమన్నారంటే!
వైసీపీ అధినేత జగన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పదే పదే 'జాకీ' అనే మాట వినియోగించడం గమనార్హం.
By: Garuda Media | 11 March 2026 3:40 PM ISTవైసీపీ అధినేత జగన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పదే పదే 'జాకీ' అనే మాట వినియోగించడం గమనార్హం. సీఎం చంద్రబాబుకు స్వయంగా ప్రకాశించే శక్తి లేదని.. ఎవరో ఒకరు ఆయనకు జాకీ వేయాలని వ్యాఖ్యానించారు. ఇక, మంత్రి, ఆయన కుమారుడు నారా లోకేష్‌కు కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ఎవరో ఒకరు జాకీలు వేయాల్సిందేనని చెప్పారు. ఇప్పుడు వీరికి పవన్ కల్యాణ్ అనే మరో జాకీ తోడైందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో చంద్రబాబు అప్పుల విషయాన్ని (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్) కళ్లకు కట్టినట్టు చూపించిందని జగన్ చెప్పారు. రెవిన్యూలోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయాయన్నారు. 2023-24తో పోలిస్తే 2024-25 నాటికే రెవిన్యూ లోటు దాదాపుగా 56% పెరిగిందన్నారు. ద్రవ్యలోటు 30 శాతానికి చేరిందన్నారు. 2025-26లో ద్రవ్యలోటు మొదటి 10నెలల కాలానికే 39.74%కి చేరుకుందన్నారు.
రోజువారీ ఖర్చుల కోసం అప్పులు మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందని జగన్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థను నడిపించే విషయంలో చంద్రబాబు అప్పులపైనే ఆధారపడ్డారని తెలిపారు. 2014-19 మధ్య అనుమతించిన దానికన్నా, ఆ ఐదేళ్లలో రూ.29,099 కోట్లు అధికంగా అప్పులు తెచ్చారని చెప్పారు. 2025-26 ఏడాదిలో పరిస్థితి ఇంతకన్నా కూడా ఘోరంగా ఉందన్నారు. తమ హయాంలో చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ రెండేళ్లలోనే చేశారని విమర్శించారు.
''ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించారు. ఎవరు ఆర్థిక వ్యవస్థను డ్యామేజీ చేశారన్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది'' అని తమ ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదని చెప్పారు. విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, దోపిడీ కారణంగా రాష్ట్రానికి ఆదాయాలు రావడం లేదన్నారు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్స్, లెటరైట్, గ్రానైట్, లిక్కర్, భూములు, అధిక రేట్లకు పీపీఏలు దేన్నీ వదిలిపెట్టడం లేదన్నారు.
ప్రభుత్వంతోపాటు వ్యవస్థలన్నీ చోద్యం చూస్తున్నాయని జగన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో, కనీస నగదు నిల్వ ఉండే రోజులు పడిపోయాయన్నారు. చంద్రబాబు చేస్తున్న పరిపాలనకు, ఆయన ఇస్తున్న బిల్డప్‌కు మధ్య తేడా కనిపిస్తోందని విమర్శించారు. వైసీపీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారని అన్నారు. ఆ ఏడాదిలో చేసిన అప్పులు రూ.81,071 కోట్లని కాగ్ తేల్చిచెప్పిందన్నారు. ''చంద్రబాబు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే, చంద్రబాబుకి ఆయన కొడుకు జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్లిద్దరికీ పవన్ కళ్యాణ్ మరొక జాకీ పెట్టి లేపుతాడు'' అని జగన్ వ్యాఖ్యానించారు.
