Begin typing your search above and press return to search.

జగన్ కోసం మోడీ వద్దకు..వైసీపీ సంచలనం

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విషయంలో గత కొద్ది రోజులుగా ఒక చర్చ సాగుతోంది. జగన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని వైసీపీ చాలా కాలంగా చెబుతూ వస్తోంది

By:  Tupaki Desk   |   10 April 2025 10:52 PM IST
జగన్ కోసం మోడీ వద్దకు..వైసీపీ సంచలనం
X

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విషయంలో గత కొద్ది రోజులుగా ఒక చర్చ సాగుతోంది. జగన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని వైసీపీ చాలా కాలంగా చెబుతూ వస్తోంది. సీఎం పదవి నుంచి దిగిపోయాక జగన్ ఏపీలో కొన్ని పర్యటనలు చేశారు. అందులో గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో సెక్యూరిటీ సరిగ్గా లేదని వైసీపీ నేతలు ఆరోపించారు.

జగన్ కి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన వాహనం కూడా సరైనది ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతకు ముందు విజయవాడకు జగన్ వచ్చినపుడు కూడా సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక లేటెస్ట్ గా రాప్తాడులో జగన్ పర్యటించినప్పుడు కూడా ఆయనకు తగిన సెక్యూరిటీ ఇవ్వలేదని వైసీపీ నేతలు అంతా ఏకకంఠంతో మాట్లాడుతున్నారు.

జగన్ ని టార్గెట్ చేస్తున్నారు అని మాకు అనుమానాలు ఉన్నాయని సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయనను మాజీ ముఖ్యమంత్రిగా చూడడం లేదని ఆయన విమర్శించారు. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉండగా కనీసంగా కల్పించడం లేదని కూడా అన్నారు. తాము జగన్ ప్రతీ పర్యటన గురించి ముందుగా సమాచారం ఇస్తున్నా భద్రతా లోపాలు మాత్రం జరుగుతున్నాయని చెప్పారు.

ఇక ఇదే మాటను మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అయ్యారు. జగన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఉన్నాయని ఆయన అంటున్నారు. అయినా సరే ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

ఇక శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ జగన్ ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కూటమి ప్రభుత్వం మీఎద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు 1100 మంది పోలీసులను బందోబస్తుగా ఇచ్చామని చెబుతున్నారని అంతా మఫ్టీలో ఉంటారా అని ప్రశ్నించారు. అక్కడ కనీసం 110 మంది కూడా లేరని ఆయన అంటున్నారు.

మాజీ సీఎం జగన్ కు భద్రత చర్యలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నిందించారు. వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత ఆక్రోశం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా భద్రతను గాలికి వదిలేస్తున్నారని అయన అన్నారు. జగన్ భద్రత పట్ల మాకు ఆందోళన ఉందని బొత్స చెప్పారు.

జగన్ భద్రత కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని తొందరలోనే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్ళి జగన్ కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తామని ఆయన అన్నారు. అదే సమయంలో రాజకీయ నాయకులపై మాట్లాడడం పోలీసులకు ఫ్యాషన్ అయిందని బొత్స సంచలన కామెంట్స్ చేశారు. మాన్యువల్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటే మళ్ళీ మాట్లాడరని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో జగన్ భద్రతకు ముప్పు ఉందా అన్నది చర్చ సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద ఈ సున్నితమైన అంశంతో వైసీపీ విమర్శలు చేస్తోంది. నిజానికి ఎవరికైనా భద్రత కోరితే కల్పించాల్సిందే. అదే విధంగా ఒక సీఎం గా చేసిన వారి విషయంలో కొంత ఇబ్బంది బయట ఉంటుంది దాంతో భద్రత కల్పించడం కామన్ గా ఉంటోంది

అయితే రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవహారాలను డీల్ చేయాల్సి ఉంటుంది. మరి జగన్ విషయంలో భద్రత ఇస్తున్నామని కూటమి చెబుతోంది. లేదని వైసీపీ అంటోంది. మరి ఈ వ్యవహారంలో నిజాలు తేల్చేది ఎవరు అన్నది చర్చగా ఉంది. ఇక కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతామని వైసీపీ నేతలు అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో. రాజకీయాలు పార్టీలు అన్నీ ప్రత్యర్థులుగా భావిస్తే ఏ రకమైన సమస్యలు ఉండవు. అవి దాటి వెళ్తేనే సమస్యలు వస్తాయి అని అంటున్నారు