జగన్ బల ప్రదర్శన చేశారా ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల కాలంలో ఎక్కడికీ పర్యటించడం లేదు.
By: Tupaki Desk | 14 Jun 2025 9:23 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల కాలంలో ఎక్కడికీ పర్యటించడం లేదు. ఇక ఆయన కొన్ని పర్యటనలను ముందుగా డేట్లు ఇచ్చి వాయిదా వేసుకున్నారు. అలా ప్రకాశం జిల్లా పొదిలి లో పొగాకు రైతులను జగన్ పరామర్శించాల్సిన కార్యక్రమం వాయిదాలు పడి చివరికి ఈ నెల 11న జరిగింది.
అయితే జగన్ ని చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎంతలా అంటే ఇటీవల కాలంలో జగన్ కి ఎక్కడా రాని జనాలు అక్కడ కనిపించారు. దాంతో వైసీపీ మీడియా అతి పెద్ద వార్తగా చేసింది అదే సమయంలో ప్రత్యర్ధి మీడియా ముందస్తుగా చేసుకున్న జన సమీకరణగా పేర్కొంది. సరే ఈ రెండింటిలో ఏది నిజమైనా కూడా జనాలు మాత్రం వచ్చారు.
దాంతో వైసీపీ శ్రేణులలో చర్చగా ఇది మారింది. జగన్ కి జనంలో ఆదరణ తగ్గలేదని వారు అనుకుంటున్నారు. ఏడాది కాలంగా జగన్ జనంలోకి వెళ్ళకపోయినా ఆయన మీద పూర్వం అభిమానం అలాగే ఉంది అని వైసీపీలో అయితే చర్చ సాగుతోంది. అదే సమయంలో బలమైన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్ కి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో పార్టీ అయితే పెద్దగా ఉనికిలోకి ఉండకూడదు. కానీ జగన్ పట్ల జనంలో అభిమానం ఉండడం వల్లనే ఇలా అంతా తరలివచ్చారు అని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. మరో వైపు వైసీపీకి గత ఏడాది కాలంలో చేదు అనుభవాలే ఉన్నాయి. ఎదురు దెబ్బలే ఎటు చూసినా తగిలాయి. ఈ క్రమంలో పొదిలిలో జగన్ చేసిన టూర్ తో కొంత వరకూ వారికి నిబ్బరం కలిగింది అని అంటున్నారు.
ఇక వైసీపీ నుంచి పోయేవారు ఎవరూ ఉండరని అంటున్నారు. తొలి ఏడాది ముగిసిందని అందువల్ల ఉండే వారు అలాగే కొనసాగుతారని అంటున్నారు. ఈ మధ్య టీడీపీ కూడా జంపింగ్ జఫాంగుల విషయంలో ప్రతీ వారినీ తీసుకోవద్దు అని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దాని వల్ల కూడా వైసీపీకే మేలు జరుగుతోంది అని అంటున్నారు.
ఏడాది పాలన పూర్తి అయింది. దాంతో ఎక్కడివారు అక్కడ కుదురుకున్నారని ఇపుడు కొత్తగా వెళ్ళినా వచ్చేది దక్కేది ఉండదన్న భావన కూడా చాలా మంది వైసీపీ నేతలలో ఉందని అంటున్నారు. ఇదే తీరున మరో ఏడాది గడిస్తే వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందని అదే సమయంలో కూటమి ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీ కూడా పెరుగుతుందని వైసీపీ శిబిరంలో చర్చ చేస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే జగన్ వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటన చేస్తారని అపుడు వైసీపీకి ఉన్న ఆదరణ ఏమిటి అన్నది ఇంకా ఎక్కువగా తేటతెల్లమవుతుందని అంటున్నారు. మొత్తం మీద పొదిలిలో జగన్ కి జనాదరణ దక్కిందని వైసీపీ నేతలు అంటూంటే జనాలను పోగు చేసి బల ప్రదర్శనకు వైసీపీ దిగిందని కూటమి వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద జగన్ నే పొలిటికల్ ఫ్యాక్టర్ ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని ఏడాది పాలన పూర్తి అయిన వేళ కూటమి పెద్దలు గట్టిగానే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
