Begin typing your search above and press return to search.

మళ్ళీ జగన్ టూర్...ఏం జరగబోతోంది ?

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వారం రోజుల వ్యవధిలోనే మరోసారి పర్యటనకు వస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 5:44 PM IST
మళ్ళీ జగన్ టూర్...ఏం జరగబోతోంది ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వారం రోజుల వ్యవధిలోనే మరోసారి పర్యటనకు వస్తున్నారు. ఆయన ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. అయితే ఆ టూర్ లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మహిళలు, పోలీసుల మీద రాళ్ళు రువ్వారని వైసీపీ నేతల మీద కేసులు పెట్టారు.

ఇక దాని మీద సీఎం చంద్రబాబు అయితే జగన్ మీద ఒక స్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ పర్యటనలకు అనుమతి ఇస్తూంటే అలజడులకు వైసీపీ సిద్ధమవుతోందని మండిపడ్డారు. ఈ విషయం ఇలా ఉండగానే జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటనకు వస్తున్నారు. పోలీసుల వేధింపుల వల్ల వైసీపీ నాయకుడు నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సిద్ధమయ్యారు.

అయితే ఈసారి జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు బాగా పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ పర్యటనలో ఎన్ని వాహనాలు ఉంటాయి, ఎంత మంది జనాలు పాల్గొంటారు అన్న దాని మీద పోలీసులు వాకబు కోసం వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

జగన్ టూర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అనుమానం ఉంటే ఆ పర్యటనను ఏ సమయంలోనైనా రద్దు చేయగలమని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. అంతే కాదు జగన్ పర్యటన షెడ్యూల్ ను ఏ పరిస్థితుల్లో అయినా సవరించే అవకాశం అధికారం తమకు ఉందని పోలీసులు పేర్కొన్నట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు.

దీని మీద వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తమ నాయకుడి పర్యటనలకు వస్తున్న ఆదరణ చూసి ఈ విధంగా షరతులు పెడుతున్నారు అని అంటున్నారు. ఇక గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అయితే చంద్రబాబు ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు.

పోలీసుల ద్వారా జగన్ పర్యటనలను అడ్డుకోవాలని చూస్తున్నారు అని ఆయన విమర్శించారు. తమ పార్టీ నేత చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించవద్దా అని ఆయన ప్రశ్నించారు. జగన్ పర్యటనలో హింస సృష్టించేందుకు టీడీపీ వారు చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు. జనాలను వారే పెట్టించి కోడి గుడ్లు జగన్ మీద వేయిస్తారు అని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ తరహా బెదిరింపులకు తాము భయపడేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. తమ అధినేత పర్యటన విజయవంతం చేస్తామని అంటున్నారు. అయితే జగన్ పొదిలి టూర్ లో చోటు చేసుకున్న ఘర్షణలు పెద్ద ఎత్తున చర్చకు ఆస్కారం ఇచ్చాయి. ఎవరు ఎవరిని రెచ్చగొట్టారో తెలియదు కానీ ఘర్షణ అయితే జరిగింది. మరి ఇపుడు కూడా అలాంటి సన్నివేశాలు రిపీట్ అవుతాయా లేక అవకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారా అన్న డిస్కషన్ సాగుతోంది.

మరో వైపు చూస్తే జనాల ముసుగులో టీడీపీ వారే అలజడులు సృష్టిస్తారు అని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. తమ పార్టీకి ప్రజాస్వామ్యంగా ఉన్న హక్కులను వాడుకుంటూ పర్యటనలు చేసుకోకూడదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటనలకు ఆటంకాలు సృష్టిస్తూ అసలు ఆయన బయటకు రాకుండా చూసేందుకే ఇలాంటివి చేస్తున్నారని షరతులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇవన్నీ సరే కానీ ఈ నెల 18న జగన్ రెంటపాళ్ళ పర్యటన ఎలా సాగుతుంది అన్నదే ఇపుడు అందరిలో ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.