వైసీపీలో పెద్ద మార్పు.. భూమనపై అధినేత ఆగ్రహం నిజమేనా?
ప్రతిపక్ష వైసీపీలో పెద్ద మార్పు కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ నేతల వ్యవహారశైలిని ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా అధినేత జగన్ ఓ కంట కనిపెడుతున్నట్లు చెబుతున్నారు
By: Tupaki Desk | 30 Aug 2025 2:00 AM ISTప్రతిపక్ష వైసీపీలో పెద్ద మార్పు కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ నేతల వ్యవహారశైలిని ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా అధినేత జగన్ ఓ కంట కనిపెడుతున్నట్లు చెబుతున్నారు. దీనికి తాజా ఉదాహరణగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని జగన్ మందలించారన్న విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు హైలెట్ చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని ఉద్దేశిస్తూ మాజీ ఎమ్మెల్యే భూమన తీవ్ర విమర్శలు చేశారు. సెల్ఫీ వీడియో విడుదల చేసి ఎక్కడా ఐఏఎస్ అధికారిణి పేరు ప్రస్తావించకుండా ఘాటు విమర్శలు చేశారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు అన్నీ శ్రీలక్షిని ఉద్దేశించినవే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీనిపై అధినేత జగన్ స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యే భూమన తీరును తప్పుబట్టినట్లు చెబుతున్నారు.
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు. వీరి మధ్య బంధుత్వం కూడా ఉంది. జగన్ తాత రాజారెడ్డి హయాం నుంచి కూడా భూమన వైఎస్ కుటుంబానికి మద్దతుదారుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి నేతను జగన్ మందలించారంటే అంత చిన్న విషయం కాదని అంటున్నారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలా పార్టీ నేతల వైఖరిపై జగన్ సీరియస్ అయిన దాఖలాలు వైసీపీలో కనిపించలేదని చెబుతున్నారు. కానీ, భూమన పరిధి దాటి వ్యాఖ్యలు చేయడం, ఆయన విమర్శల వల్ల శ్రీలక్ష్మి నొచ్చుకునే పరిస్థితి ఉండటంతో జగన్ జోక్యం చేసుకున్నారని అంటున్నారు.
గత ప్రభుత్వంలో తిరుపతి కార్పొరేషన్ లో టీడీఆర్ బాండ్ల జారీలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ ఎమ్మెల్యే భూమన ఆరోపించారు. దీనికి శ్రీలక్ష్మి కారణమన్నట్లు ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. అయితే ఇందులో భూమనను తప్పుపట్టే పరిస్థితి లేకపోయినా, మహిళా అధికారిణి వ్యక్తిత్వం కించపరిచేలా ఆమె వ్యక్తిగత విషయాలపై భూమన వ్యాఖ్యలు చేయడమే దుమారం రేపింది. మహిళా అధికారిణి కట్టుకునే చీరతోపాటు బాడీ షేమింగ్ చేసేలా ఆమె ధరించే విగ్గుపైనా భూమన మాట్లాడారు. ఇవి పార్టీకి నష్టం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవడంతో జగన్ కలగజేసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ విషయమై జగన్ నేరుగా భూమనతో మాట్లాడరని, మహిళా అధికారిణి విషయంలో బహిరంగంగా అలా మాట్లాడటం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అలా ఎందుకు మాట్లాడాల్సివచ్చిందో వివరణ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీనిపై భూమన స్పందన తెలియాల్సివుంది. గత ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కీలకంగా పనిచేశారు. తెలంగాణ కేడర్ కు చెందిన ఆమెను జగన్ ఏరికోరి తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి శ్రీలక్ష్మి ఆ కుటుంబానికి విధేయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో సహ నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదంతా దృష్టిలో పెట్టుకుని జగన్ సీఎం అవ్వగానే శ్రీలక్ష్మిని రాష్ట్రానికి తీసుకువచ్చి కీలకమైన మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే ఆమె ఆ హోదాలో తిరుపతిలో వందల కోట్ల టీడీఆర్ స్కాం చేశారని భూమన ఆరోపణలు గుప్పించడంతో వైసీపీ అధినేత ఇరుకన పడిపోయారు. ఈ విషయంలో ఎవరినీ సమర్థించలేని పరిస్థితిని జగన్ ఎదుర్కొంటున్నట్లు వైసీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. భూమనను సమర్థిస్తే తమ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అంగీకరించినట్లు అవుతుందని, మహిళా అధికారిని దూషించిన వారిని ప్రోత్సహించినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో శ్రీలక్ష్మిని వెనకేసుకు రావడం కూడా ఇబ్బందే అంటున్నారు. దీంతో ఈ విషయంపై బహిరంగంగా మరోసారి మాట్లాడొద్దని భూమనను మందలించిన జగన్.. ఈ వివాదాన్ని ముగించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.
