Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ను కాదు.. జ‌నాన్ని చూడాల్సిన టైం ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ జ‌నంలోకి వ‌స్తున్నారు. ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం క‌ష్టంగా మారుతోంది.. అని పోలీసులు చెబుతున్నారు.

By:  Garuda Media   |   18 July 2026 1:00 AM IST
జ‌గ‌న్‌ను కాదు.. జ‌నాన్ని చూడాల్సిన టైం ..!
X

వైసీపీ అధినేత జ‌గ‌న్ జ‌నంలోకి వ‌స్తున్నారు. ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం క‌ష్టంగా మారుతోంది.. అని పోలీసులు చెబుతున్నారు. ఇక‌, దీనికి సంబంధించి.. అధికార కూట‌మిలోనూ చ‌ర్చ సాగుతోంది. అయితే... ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది.. జ‌గ‌న్ రావ‌డం క‌న్నా.. ఆయ‌న స‌భ‌లు, స‌మావేశాలు, ఓదార్పు యాత్ర‌ల‌కు వ‌స్తున్న జ‌నాన్ని. తాజ‌గా జ‌రిగిన ఆక్వా రైతుల స‌మావేశానికి పెద్ద ఎత్తున జ‌నాలు త‌ర‌లివ‌చ్చారు. యువ‌త భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. ఇవ‌న్నీ.. స‌ర్కారుకు.. అత్యంత కీల‌కం.

జ‌గ‌న్‌ను చూస్తున్న ప్ర‌భుత్వం.. ఆయ‌న నిర్వ‌హిస్తున్న స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న వాద‌న ఉంది. వాస్త‌వానికి రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న అందిస్తోంద‌ని సీఎం నుంచి మంత్రుల వ‌ర‌కు చెబుతున్నారు. మ‌రి అలాంట‌ప్పుడు ఇంత భారీ సంఖ్య‌లో జ‌నాలు ఎక్క‌డ నుంచి వ‌స్తున్నారు? ఎందుకు వ‌స్తున్నారు? వారి స‌మ‌స్య‌లు ఏంటి? అనే విష‌యంపైనే ప్ర‌భుత్వం ఫోక‌స్ పెంచాలి. కేవ‌లం జ‌గ‌న్‌ను చూస్తే.. స‌రిపోద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న స‌భ‌లే అంతంత మాత్రంగా ఉంటున్నాయి. వాటికి జ‌నాలు పోటెత్తుతున్నారంటే.. కూట‌మి స‌ర్కారుపై ప్ర‌జ‌లకు ఏదో తెలియ‌ని అసంతృప్తి వెంటాడుతోంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిని లైట్ తీసుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇదే ప్ర‌ధాన అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఇలాంటి స‌మ‌యాల్లోనే ప్ర‌జ‌ల‌కు ఏం చేయాలో.. వారు ఏం కోరుకుంటున్నారో ప్ర‌భుత్వం తెలుసుకుని.. దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది.

గ‌తంలో చంద్ర‌బాబు స‌భ‌ల‌కు.. జ‌నాలు ఇలానే పోటెత్తిన‌ప్పుడు వైసీపీ స‌ర్కారుపై వ్య‌తిరేక‌త‌తోనే వ‌చ్చార‌ని చంద్రబాబు చెప్పుకొచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించాలి. ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఎందుకు ఉండ‌కూడ‌దు? అనే ది ప్ర‌శ్న‌. అంతా బాగుంద‌ని చంద్ర‌బాబు అనుకోవ‌చ్చు. మంత్రులు చెప్ప‌నూ వ‌చ్చు. కానీ, ప్ర‌జ‌ల అభిప్రాయ‌మే ప్ర‌ధానం కాబ‌ట్టి ఆదిశ‌గా వాస్త‌వ ప‌రిస్థితిని తెలుసుకుని,, ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. లేక‌పోతే.. ప్ర‌మాదాన్ని కావ‌లించుకున్న‌ట్టేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.