జనంలోకి జగన్...ఎందుకంత చర్చ ?
రాజకీయ నాయకుడు అన్నాక జనంతోనే ఉండాలి, వారితోనే మమేకం కావాలి. నీటితోనే చేప పిల్లకు బంధం ఎలాగో నాయకుడికీ అలాగే ప్రజలతోనే బలమైన బంధం ఉంటుంది.
By: Satya P | 20 Dec 2025 4:00 PM ISTరాజకీయ నాయకుడు అన్నాక జనంతోనే ఉండాలి, వారితోనే మమేకం కావాలి. నీటితోనే చేప పిల్లకు బంధం ఎలాగో నాయకుడికీ అలాగే ప్రజలతోనే బలమైన బంధం ఉంటుంది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ అధినేత జగన్ విషయంలో ఒక రకమైన చర్చ సాగుతోంది. అదే ఆయన ఎపుడు జనంలోకి వస్తారు అన్నది. జగన్ నిజానికి ఈపాటికే వచ్చి ఉండాల్సింది అని కూడా అంటూంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీగా ప్రజలలో ఉంటేనే దానికి హైప్ వస్తుంది, గ్రాఫ్ పెరుగుతొంది. చూస్తూండగానే ఏడాదిన్నర కాలం ఇట్టే గడచిపోయింది. కానీ జగన్ మాత్రం ఇంకా జనంలోకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు. ఇదే ఇపుడు హాట్ టాపిక్ గా పార్టీలోనూ బయటా ఉంది.
అలా ప్రచారంలో :
ఇక 2024 డిసెంబర్ నెలలో అంటే ఏడాది క్రితం ఇదే సమయంలో వైసీపీలో ఒక ప్రచారం అయితే సాగింది. జగన్ 2025 సంక్రాంతి నుంచి జనంలోకి వస్తున్నారు అని. ఆయన జిల్లాల పర్యటనలు చేపడతారు అని. సంక్రాంతి పండుగ పూర్తి అవుతూనే జగన్ ఏపీ అంతా కలియ తిరుగుతారని కూడా అంతా అనుకున్నారు. కానీ గిర్రున పన్నెండు నెలలు తిరిగేశాయి. మళ్ళీ సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తోంది. జగన్ మాత్రం జనం లోకి రాలేదు. రాలేదూ అంటే పూర్తిగా అయితే కాదు, ఆయన అడపా దడపా పర్యటనలు చేశారు. అయితే ఇవేమీ పార్టీ గ్రాఫ్ ని పూర్తి స్థాయిలో పెంచేవి కావు. అలా కాకుండా విపక్ష నేతగా జిల్లా పర్యటనలు చేస్తూ కొన్ని రోజుల పాటు వారి మధ్యనే ఉండేలా ప్లాన్ చేసుకుంటే అది రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది. కానీ అవేమీ అయితే ఆచరణకు ఆమడ దూరంలోనే ఉన్నాయి.
ఈసారి అయినా :
మరి కొద్ది రోజులలో 2025 ముగిసి 2026 వస్తుంది. సంక్రాంతి పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది.మరి ఈ పండుగ తరువాత అయినా జగన్ జనంలోకి వస్తారా జిల్లా టూర్లు ఉంటాయా అంటే దానికి ఇదమిద్దంగా అయితే జవాబు లేదని అంటున్నారు. ఇప్పటికైతే కోటి సంతకాల సేకరణ పేరుతో క్యాడర్ లో వేడి పుట్టించారు. అదే విధంగా నాయకులలో కొంత చలనం తెచ్చారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు అన్న ఇష్యూని ఏదో విధంగా జనాలకు చేరవేయగలిగారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ కార్యక్రమం తాజాగా పూర్తి అయింది. దాంతో క్యాడర్ సైతం రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిపోయేలా సీన్ కనిపిస్తోంది. దాంతో జగన్ ఈ సమయంలో గేర్ మార్చాలని అంటున్నారు.
అదే పెద్ద డౌటా :
ఇవన్నీ పక్కన పెడితే జగన్ జనాల్లోకి వస్తే ఆదరణ ఎలా ఉంటుంది అంటే బాగానే అని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ జనసమీకరణ ఉంటుంది. అలాగే ఆయనను చూసేందుకు వచ్చే వారూ ఉంటారు. దాంతో ఆ విషయంలో అయితే ఢోకా లేదు, కానీ జనంలోకి వెళ్తే వారు చెప్పే సమస్యల గురించి మాట్లాడాలి, అదే సమయంలో జగన్ 2014 నాటి ప్రతిపక్ష నేత కాదు, ఒక అయిదేళ్ళు ఏపీని పాలించిన సీఎం గా ఉన్నారు. దాంతో ఆయన పాలనలో కొన్ని మంచి పనులు జరిగాయి. అలాగే ఆయన ప్రభుత్వంలో చేయని కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అయితే చేయలేకపోయారు.
వస్తే ఏమి జరుగుతుంది :
మరి ఆయా వర్గాలు జగన్ పర్యటనలో తమకు ఏమి చేశారు అని ప్రశ్నిస్తే ఎలా అన్నది కూడా చర్చగా ఉంది. ఆ ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు. అదే విధంగా మునుపటిలా కూటమి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుంది అనుకున్నా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఎందుకు అంటే 2019 నుంచి 2024 మధ్యలో విపక్షాలకు వైసీఎపీ ప్రభుత్వం ఆక్షలు పెట్టిందని గుర్తు చేస్తున్నారు. అలా ఆంక్షలతో పర్యటనలు అనుమతులు ఇస్తే అది కూడా ఇబ్బందిగానే ఉంటుంది అని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ జనంలోకి ఎపుడు వస్తారో తెలియదు కానీ వస్తే ఏమి జరుగుతుంది, ఎలాంటి రాజకీయ వాతావరణం ఉంటుంది అన్నది మాత్రం చూడాల్సి ఉందని అంటున్నారు.
