మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రాగానే జైల్లో వేస్తానంటూ వార్నింగ్!
తాడేపల్లిలో కోటి సంతకాల వాహనాలకు పచ్చజెండా ఊపి పంపిన మాజీ సీఎం జగన్.. అనంతరం పార్టీ నేతలను వెంటబెట్టుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు.
By: Tupaki Political Desk | 18 Dec 2025 5:40 PM ISTమాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తామన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన.. ఈ విషయంలో తన స్టాండును మరోమారు స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై నిర్వహించే టెండర్ల ప్రక్రియలో ఎవరూ పాల్గొనవద్దని, తాను మళ్లీ సీఎం అయిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేస్తానని గతంలోనే హెచ్చరించారు జగన్.. ఇప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడుతున్నట్లు చెబుతూనే పీపీపీ విధానంలో అక్రమాలకు పాల్పడుతున్నవారిని జైల్లో పెట్టిస్తానని హెచ్చరించడం గమనార్హం.
పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు ఉద్యమం చేపట్టిన వైసీపీ.. కోటి సంతకాల పత్రాలను లోక్ భవన్ కు చేర్చింది. వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి కోటి సంతకాలతో కూడిన పేపర్లను వాహనాల ద్వారా లోక్ భవన్ కు పంపారు. తాడేపల్లిలో కోటి సంతకాల వాహనాలకు పచ్చజెండా ఊపి పంపిన మాజీ సీఎం జగన్.. అనంతరం పార్టీ నేతలను వెంటబెట్టుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మెడికల్ కాలేజీలను స్వాధీనం చేసుకున్న వారిని జైలుకు పంపుతామని జగన్ హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడంపైనా చర్చ జరుగుతోందని అంటున్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో ఐదు పూర్తయ్యాయని చెబుతున్నారు. మిగిలిన కళాశాల్లో పది వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం దశలవారీగా పీపీపీ విధానంలో నిర్మించాలని భావిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న మాజీ సీఎం జగన్ భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
అక్టోబరు 7న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సంతకాలను సేకరించినట్లు వైసీపీ చెబుతోంది. ఈ నెల 10వ తేదీ వరకు ప్రజలను కలిసి సంతకాలు సేకరించిన వైసీపీ నేతలు.. మొత్తం కోటి నాలుగు లక్షల పేపర్లను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపారు. వీటిని గురువారం లోక్ భవన్ లో గవర్నర్ కార్యాలయానికి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో తరలించారు.
ఇక ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కాలేజీలను దక్కించుకునేవారిని జైల్లో పెడతానని జగన్ ప్రకటించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. విపక్ష నేత హెచ్చరికల నడుమ పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీల అభివృద్ధికి ఎవరు ముందుకు వస్తారనేది ఆసక్తి పెంచుతోందని అంటున్నారు. జగన్ తాజా వ్యాఖ్యలు గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
