Begin typing your search above and press return to search.

జగన్ అంచనాలు తప్పు అవుతున్నాయా ?

వైఎస్సార్ విషయం తీసుకున్నా అరవై ఏళ్ళు రాగానే రాజకీయాలు స్టాప్ అని ఒక కఠిన నిర్ణయమే తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   27 May 2025 8:30 AM IST
జగన్ అంచనాలు తప్పు అవుతున్నాయా ?
X

వైసీపీ అధినేత జగన్ రాజకీయాల్లోకి నేరుగా వచ్చారు అని అంటారు. నిజం చెప్పాలంటే ఆయన రాజకీయ పాఠాలు ఎవరి దగ్గర నేర్చలేదు. ఆయనే కనుక నేర్చుకోవాలి అనుకుంటే ఇంట్లోనే దిగ్గజ నేత వైఎస్సార్ రూపంలో ఉన్నారు. అయితే జగన్ కి రాజకీయాల పట్ల ఎపుడు ఆసక్తి కలిగిందో కూడా ఇక్కడ ప్రధానమే.

మరో వైపు చూస్తే ఇతర నాయకుల మాదిరిగా జగన్ తన తండ్రి రాజకీయంగా పీక్స్ లో ఉన్నపుడు జిల్లాలో ఉంటూ తండ్రి వెన్నంటి రాజకీయాలు చేయలేదు. ఆయన పారిశ్రామిక రంగాన్ని ఎంచుకున్నారు. ఇక వైఎస్సార్ కి కూడా వారసుడిని రాజకీయాల్లోకి తేవాలని అనిపించి ఉండదు. అదే అనుకుంటే 2009 కంటే ముందే జగన్ ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసి ఉండేవారు.

వైఎస్సార్ విషయం తీసుకున్నా అరవై ఏళ్ళు రాగానే రాజకీయాలు స్టాప్ అని ఒక కఠిన నిర్ణయమే తీసుకున్నారు. అయితే రెండోసారి బొటాబొటీతో కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కాంగ్రెస్ లో అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా నాటి యూపీఏ సర్కార్ రెండోసారి అధికారంలోకి రావడానికి అత్యధిక ఎంపీలను ఇచ్చిన ముఖ్య నేతగా ఆయనకే సెకండ్ టెర్మ్ సీఎం పీఠం దక్కింది. కానీ విధి మరోలా తలచి ఆయనను కానరాని లోకాలని తీసుకుని పోయింది.

అలా జస్ట్ మూడు నెలల ఎంపీగా జగన్ రాజకీయ క్షేత్రంలో ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది ఇక ఆయనకు రాజకీయ అనుభవాలు అంటే ఎదుర్కొన్న సమస్యలు ఎదురుదెబ్బలే అని చెప్పాల్సి ఉంది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక ఆయన ఎంచుకున్నది ఆయనను ఎంచుకున్నది రాజకీయాల్లో తలపండిన వారు కాదు, అప్పటిదాకా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నా తెర వెనక ఉన్న వారే కావడం విశేషం.

అలాంటి వారినే జగన్ దగ్గరకు తీసి తన కోటరీలో ఉంచుకున్నారు. వారికే అందలాలు ఇచ్చారు. వారినే పూర్తిగా నమ్మారు. వారికి పదవులు అన్నీ ఇచ్చాను కదా తనతోనే కష్టంలో సుఖంలో ఉంటారు అని అనుకున్నారు. అంతే కాదు పదవులు ఒకసారి ఇచ్చి మరోసారి పక్కన పెట్టినా వారు తన ఆలోచనలను అర్థం చేసుకుంటారు అనుకున్నారు.

కానీ అలా ఏమీ జరగలేదు ఇదే అసలైన రాజకీయం. రాజకీయాల్లో ఎపుడూ లాభ నష్టాలే ఉంటాయి తప్ప అధినేత కష్టాలు పార్టీ కష్టాలు ఏ రోజూ ప్రధమ స్థానంలో ఉండవు. దాని ఫలితంగానే అనేక మంది నాయకులు జగన్ ని వీడిపోతున్నారు. ఆఖరుకు ఆయన నీడ లాంటి వారు కూడా గుడ్ బై చెబుతూంటే జనాలు ఇదంతా కామన్ అనుకుంటున్నారు. జగన్ మాత్రం హర్ట్ అవుతున్నారు.

వారిని నేనేమి తక్కువ చేశాను అని ఆవేదన చెందుతున్నారు. ఎవరికైనా ఒకసారి అందలం ఎక్కించి మరోసారి దించేస్తే వారికి బాధే ఉంటుంది కానీ ఒకసారి ఎక్కించిన అందలం ఎందుకు గుర్తుకు వస్తుంది. పైగా ఆ అందలం అందించే అధికార వైభోగానికి అలవాటు పడిన వారు దాని కోసమే చూస్తారు. వేరు మార్గాలను అనుసరిస్తారు.

వైసీపీలో ఇపుడు అదే జరుగుతోంది. ఈ ఏడాదిలో చాలా మంది నేతలు పార్టీని వీడిపోయారు. వైసీపీ పునాదుల నుంచి ఉన్న వారు కూడా గుడ్ బై చెప్పారు. ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వారూ ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే జగన్ రాజకీయాలను రాజకీయంగా చూడకపోవడం వల్లనే అని అంటున్నారు.

రాజకీయ ఆటను అవే లెక్కలతో అలాగే ఆడాలి. లేకపోతే అది దెబ్బ కొట్టేస్తుంది. వర్తమాన రాజకీయాల గురించి అందరికీ తెలిసినా జగన్ మాత్రం ఇంకా దేవుడు ప్రజలు అంటున్నారని వైసీపీ వర్గాలే చెప్పుకుంటాయి. రాజకీయం అన్నది ఒక ఆటగా తీసుకుంటే అందులో గెలుపు ఒక్కటే కనిపిస్తుంది. ఈ రోజున దేశంలో కానీ ప్రపంచంలో కానీ నీతిగా నిజాయితీగా నూరు శాతం రాజకీయాలు చేసేవారు ఎంతమంది అన్నది కూడా చూడాలని అంటున్నారు.

రాజకీయాల్లో ఆత్మ హత్యలే ఉంటాయి అని అంటారు. హత్యలు అన్నవి ఉండవు. ఎందుకంటే ఎవరైనా తాము పేర్చుకున్న మేడను తామే కూల్చుకుంటారు అది వారి సొంత నిర్ణయాల వల్లనే. జగన్ సైతం తన ఆలోచనలను మార్చుకుంటేనే వైసీపీకి భవిష్యత్తు అని అంటున్నారు. అంతే తప్ప బయటకు వెళ్ళిపోయిన వారిని విమర్శించడం వల్ల ఒరిగేది ఉండదని అంటున్నారు.

పైగా ఒక నాయకుడికి పదవి ఇచ్చే ముందు ఆయన మీద జగన్ వంటి వారు వేసుకున్న అంచనాలు తప్పు అని వారు పార్టీ గేటు దాటేసినపుడే జగన్ కి తెలుస్తోంది అని అంటున్నారు. మొత్తానికి ఈసారి విపక్షంలో కూర్చోవడం వైసీపీకి జగన్ కి ఎన్నో అనుభవాలను ఇస్తోంది. వీటి నుంచి ఎంతో నేర్చుకుని భవిష్యత్తుకు సోపానంగా మార్చుకుంటేనే మేలు అన్న సూచనలు వెలువడుతున్నాయి.