Begin typing your search above and press return to search.

యుద్ధం నుంచే పుట్టింది...జగన్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ కొత్తగా ఏర్పాటు చేసిన పీఏసీ మీటింగులో ఆయన మాట్లాడుతూ యుద్ధానికి వైసీపీకి మధ్య ఉన్న కనెక్షన్ ని ఆసక్తికరంగా చెప్పారు.

By:  Tupaki Desk   |   22 April 2025 5:40 PM IST
PAC Will Lead the Charge for YSR Congress
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కొత్తగా ఏర్పాటు చేసిన పీఏసీ మీటింగులో ఆయన మాట్లాడుతూ యుద్ధానికి వైసీపీకి మధ్య ఉన్న కనెక్షన్ ని ఆసక్తికరంగా చెప్పారు. యుద్ధం మనకు కొత్త కాదని అంటూ యుద్ధ వాతావరణం నుంచే వైసీపీ పుట్టిందని అన్నారు. అలా యుద్ధ వాతావరణంలోనే పెరిగి పదేళ్ళ పాటు వైసీపీ యుద్ధమే చేసింది అని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

వైసీపీ ఎపుడూ పోరాటాలకు వెరవదు అని ఆయన చెప్పారు. తనను పదహారు నెలల పాటు జైలులో ఉంచారు, ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. కేసులు పెట్టి వైసీపీ వారిని బెదిరించాలని అనుకుంటే కుదిరేది కాదని ఆయన అన్నారు. కేసులతో జైలు పాలు చేయవచ్చు కానీ కూటమి ప్రభుత్వం మీద పెరిగిన ప్రజా వ్యతిరేకతను ఎవరూ తగ్గించలేరని ఆయన అన్నారు.

ప్రజల సమస్యల గురించి పోరాటాలు చేస్తే కచ్చితంగా వారి అండ వైసీపీకి దక్కుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నో ఆయుధాలు ఇస్తోందని జగన్ అండం విశేషం. వాటిని పట్టుకుని ప్రజలలోకి వెళ్ళాలని ఆయన కోరారు. ఎవరో ఆదేశాలు ఇచ్చేంతవరకూ ఊరుకోకుండా పీఏసీ సభ్యులే ఇక మీదట పార్టీలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

ప్రతీ అంశం మీద పీఏసీ మీటింగులు పెట్టాలని అదే విధంగా ఆ మీటింగుల ద్వారా సరైన నిర్ణయాలను తీసుకుని వాటిని పార్టీకి అందించాలని ఆయన కోరారు. పార్టీకే దిశా నిర్దేశం చేసేలా పీఏసీ పనితీరు ఉండాలని జగన్ కోరుకున్నారు.

గ్రాస్ రూట్ లెవెల్ లో పార్టీ యాక్టివిటీని పెంచాలని జగన్ సూచించారు. కార్యకర్తనే వైసీపీ ముందుకు పెట్టి పోరాటం చేస్తుంది అని అన్నారు. టీడీపీకి అనేక అనుకూల పత్రికలు చానళ్ళు ఉన్నాయని వైసీపీకి కార్యకర్తలే ఆ లోటు తీర్చాలని జగన్ కోరారు. చేతిలో ఉన్న ఫోన్ తో జనాలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అక్రమాలను విప్పి చెప్పాలని ఆయన కోరారు.

ఇదిలా ఉండగా పీఏసీ మీద జగన్ గురుతర బాధ్యతలు పెట్టారు, తరచూ సమావేశం కావాలని కోరారు. ఆదేశాలు వచ్చేంతవరకూ వేచి ఉండరాదని తామే నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మరి జగన్ ఈ విధంగా పీఏసీకి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లేనా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు పీఏసీ నిర్ణయాలను పార్టీ ఆమోదిస్తుందని అత్యున్నత వేదిక అదే అని జగన్ చెప్పడం ద్వారా సీనియర్ల పాత్రను పార్టీలో పెంచబోతున్నారా అన్న చర్చ కూదా సాగుతోంది. మొత్తానికి జగన్ భారం అంతా పీఏసీ మీదనే వేశారని అంటున్నారు. చూడాలి మరి పీఏసీ ఏ తీరున ముందు ముందు తన నిర్ణయాలతో వైసీపీని నడిపిస్తుందో.