ముద్రగడ పాడె మోసిన జగన్.. తీవ్ర భావోద్వేగం
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి ఆవరణలోనే ఆయన అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
By: Tupaki Political Desk | 15 July 2026 5:11 PM ISTకాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి ఆవరణలోనే ఆయన అంతిమ సంస్కారాలను నిర్వహించారు. హిందూ సంప్రదాయం మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి భీమవరం పర్యటన ముగించుకుని మధ్యహ్నం 3 గంటల సమయానికి కిర్లంపూడి చేరుకున్న తర్వాత ముద్రగడ అంతిమ సంస్కారాలు మొదలుపెట్టారు. ముద్రగడ పాడెను మోసిన మాజీ సీఎం జగన్ పార్టీ నేతకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ముద్రగడ అంత్యక్రియలలో వైసీపీ నేతలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ముద్రగడ పాడె మోసి ఆయనపై అభిమానం, గౌరవం చాటుకున్నారు. జగన్ తోపాటు వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులు ముద్రగడ పాడె మోసేందుకు భుజం కలిపారు. దివంగత నేతను కడసారి చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు తరలివచ్చారు. అభిమాన నేతకు కన్నీటితో వీడ్కోలు పలికారు.
షెడ్యూల్ ప్రకారం భీమవరంలో పర్యటన ముగించుకున్న అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిర్లంపూడి చేరుకున్నారు. ముందుగా భీమవరం నుంచి జగ్గంపేట వరకు హెలికాప్టర్ లో వచ్చిన జగన్ అక్కడి నుంచి కారులో కిర్లంపూడి వెళ్లారు. ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కొద్దిసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. ముద్రగడ కుటుంబాికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ ఇంటి ఆవరణలో అంత్యక్రియలు చేయగా, సంప్రదాయం ప్రకారం కార్యక్రమం పూర్తయ్యే వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్కడే ఉన్నారు.
ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా ఆయన పాడె మోయడం ద్వారా జగన్ తన అభిమానాన్ని చాటుకున్నారని అంటున్నారు. గతంలో ఎప్పుడు కూడా మాజీ సీఎం జగన్ ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవని వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ముద్రగడకు ఎంతటి ప్రాధాన్యం ఉందో ఈ ఘటన ద్వారా అర్థమవుతోందని అంటున్నారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటికి వెళ్లడమే కాకుండా, పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సంతాప సభ ఏర్పాటు చేయడం ద్వారా సీనియర్ నేతకు ఘన నివాళులర్పించారని వ్యాఖ్యానిస్తున్నారు.
