జగన్ కేరాఫ్ లోటస్ పాండ్...కొత్త వ్యూహమేంటి ?
జగన్ సైతం తెలంగాణా నుంచి వస్తూ పోతూ ఏపీలో రాజకీయాలు చేస్తే ఆయన మీద ఏపీకి చుట్టం అన్న విమర్శలకు చెక్ పడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.
By: Satya P | 16 April 2026 9:10 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బెంగళూరులోని యెహలెంక ప్యాలెస్ లో ఉంటున్నారు దాంతో టీడీపీ కూటమి నేతలు తరచూ ఆయనను కేరాఫ్ బెంగళూరు అని విమర్శిస్తున్నారు ఏకంగా తెలుగు రాష్ట్రాలను దాటి వేరే రాష్ట్రంలో ఉంటూ ఎపుడో ఒకసారి వచ్చే జగన్ కి ఏపీ సమస్యల మీద ప్రజల మీద ఏమి నిబద్ధత ఉందని కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఇపుడు ఒక వార్త మాత్రం పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకుంటోంది. అదేంటి అంటే వైఎస్ జగన్ తన మకాం తెలంగాణాకు మార్చబోతున్నారు అని. ఆయన లోటస్ పాండ్ లోని తన ఇంటి నుంచే ఇక మీదట ఏపీ రాజకీయాన్ని చేస్తారు అని అంటున్నారు.
విమర్శలకు చెక్ అంటూ :
జగన్ సైతం తెలంగాణా నుంచి వస్తూ పోతూ ఏపీలో రాజకీయాలు చేస్తే ఆయన మీద ఏపీకి చుట్టం అన్న విమర్శలకు చెక్ పడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. పైగా ఏపీ రాజకీయ నేతలు అంతా హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని గుర్తు చేస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్ కే వీకెండ్స్ లో వెళ్తున్నారు కాబట్టి జగన్ ని అనేందుకు ఆస్కారం ఉండదని అంటున్నారు. వీటి సంగతి పక్కన పెడితే జగన్ గతంలో అంటే 2014 నుంచి 2019 దాకా ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు కేరాఫ్ లోటస్ పాండ్ గానే ఉండేవారు. కానీ 2024 లో మాత్రం ఆయన రూట్ మార్చి బెంగళూరుకు చేరుకున్నారు. మరి ఎందుకు ఆయన లోటస్ పాండ్ కి తిరిగి వెళ్ళలేదు అన్నది ఒక చర్చగా అప్పట్లో సాగింది.
సెంటిమెంట్ కోసమేనా :
ఇక పాదయాత్రకు జగన్ సిద్ధపడుతున్నారు. ఆయన 2017లో ఏపీలో పాదయాత్ర చేసినపుడు మొత్తం కార్యకలాపాలు అన్నీ లోటస్ పాండ్ నుంచే సాగిపోయాయి. అది పాజిటివ్ సెంటిమెంట్ గా మారి వైసీపీకి ఘన విజయం దక్కేలా చేసింది. ఇపుడు అదే సెంటిమెంట్ కోసమే లోటస్ పాండ్ కి జగన్ షిఫ్ట్ అవుతున్నారు అని అంటున్న వారూ ఉన్నారు. జగన్ సెంటిమెంట్ లో మరో విషయం కూడా ఉంది. ఆనాడు 2017లో పాదయాత్ర మొదలెట్టి 2019 జనవరిలో ముగిస్తే భారీ విజయం దక్కింది. ఈసారి కూడా 2027నే ఆయన పాదయాత్రకు లక్కీ సెంటిమెంట్ ఇయర్ గా ఎంచుకున్నారు అని అంటున్నారు.
కో ఆర్డినేషన్ కోసం :
అంతే కాదు లోటస్ పాండ్ అంటే హైదరాబాద్ కి ఏపీలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఉన్న తాడేపల్లికి మధ్య తక్కువ దూరం ఉంటుందని రేపటి రోజున జగన్ పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్ళినా కో ఆర్డినేషన్ చేసుకోవడానికి పార్టీ నేతలకు వీలు కలుగుతుందని అంటున్నారు దాంతో పాటుగా రాజకీయ వ్యూహం కూడా ఉందని అంటున్నారు. తెలంగాణాలోనూ వైసీపీని బలోపేతం చేస్తారు అని అంటున్నారు.
వైసీపీకి బలం :
తెలంగాణాలో మూడు అసెంబ్లీ ఒక ఎంపీ సీటుని 2014 లో గెలుచుకున్న వైసీపీ రానున్న కాలంలో తెలంగాణాలో వైసీపీని బలోపేతం చేసుకునే వ్యూహం ఉందా అంటే అవును అనే జవాబు వస్తోంది అని అంటున్నారు. వైసీపీ నేరుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోయినా ఇతర పార్టీలు తమ వైపు చూసేలా ఫలితంగా తమ రాజకీయానికి ఏపీలో మేలు జరిగేలా చూసుకోవాలీ అంటే తెలంగాణాలో తమ బలం చాటాల్సి ఉందని భావించే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ని అక్కడ వీక్ చేస్తూ విపక్ష రాజకీయానికి ఊతం ఇచ్చేలా వైసీపీ యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది అని అంటున్నారు ఏపీలో తన సొంత చెల్లెలుని తన మీదకు ఎగదోసిన కాంగ్రెస్ కి తెలంగాణాలో చెక్ చెప్పాలన్నదే వైసీపీ అసలైన స్ట్రాటజీ అని అంటున్నారు. మొత్తానికి అనేక రకాల ఆలోచనతోనే లోటస్ పాండ్ కి జగన్ తొందరలో షిఫ్ట్ అవుతారు అని అంటున్నారు.
