Begin typing your search above and press return to search.

బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్.. మున్సిపల్ ఎన్నికల వేడి, ఎస్ఈసీతో భేటీ

మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ల పర్వంలో హింస, ఎన్నికల సంఘం పనితీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

By:  Tupaki Political Desk   |   18 Oct 2026 7:14 PM IST
బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్.. మున్సిపల్ ఎన్నికల వేడి, ఎస్ఈసీతో భేటీ
X

మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ల పర్వంలో హింస, ఎన్నికల సంఘం పనితీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్ల సందర్భంగా పులివెందుల, పుంగనూరు, రాయచోటి, రాజంపేట వంటి ప్రాంతాల్లో వైసీపీపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన ఆదివారం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు. ముందుగా ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠాను కలిసి ఎన్నికల అధికారులు, పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గలేక అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా దౌర్జన్యాలకు తెగబడుతోందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదని, నామినేషన్ కేంద్రాల వద్దే పత్రాలను చించివేస్తూ, అభ్యర్థులపై భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. పుంగనూరులో పార్టీ లోక్‌సభ పక్షనేత పీవీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం చేయడం, పులివెందులలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడం, బాష్పవాయువు ప్రయోగించడం వంటి సంఘటనలు రాష్ట్రంలో ఏరకమైన 'గూండా రాజ్' నడుస్తోందో నిరూపిస్తున్నాయని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికెగిరిపోవడంతో, మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేకనే చంద్రబాబు ఈ విధ్వంసకాండకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఎన్నికల వ్యవస్థల నియామకం పనితీరుపై జగన్ కొన్ని కీలకమైన సంస్కరణలను డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల నియామకం ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాల ఆధారంగా జరగకూడదని స్పష్టం చేశారు. కేంద్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) నియామకం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), ప్రధాని, విపక్ష నేతలతో కూడిన కమిటీ ద్వారా జరగాలని సూచించారు. అదే రీతిలో రాష్ట్రంలో ఎస్‌ఈసీ నియామకం కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల సంయుక్త నిర్ణయంతో జరగాలని డిమాండ్ చేశారు. గతంలో ఎస్‌ఈసీ, సీఈసీ నియామకాలను ప్రభుత్వం నిర్ణయించే విధానాన్ని తమ ప్రభుత్వం కూడా సమర్థించిందని, అయితే ఆ రోజు తాము చేసిన తప్పుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నామని, విద్యార్థులే ఎగ్జామినర్‌ను ఎన్నుకున్నట్లుగా ఈ విధానం ఉందన్నారు.

ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వైఖరిపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనిల్ చంద్ర పునేఠా తీరుపై నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి విధుల నుంచి తొలగించిందని గుర్తుచేశారు. పదవీ విరమణ పొందిన అటువంటి వ్యక్తిని చంద్రబాబు మళ్లీ ఏపీ ఎస్‌ఈసీగా తీసుకొచ్చారని, ఆయన వీరవిధేయుడిగా మారి కూటమి ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే నామినేషన్ కేంద్రాల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను మారుస్తారనే అనుమానాలు ఉన్నందున స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాల నిఘా పెట్టాలని మరియు 17C ఫారమ్‌లలో ఫోర్జరీ సంతకాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

చివరగా, కూటమి ప్రభుత్వం నాటుతున్న ఈ విష విత్తనాలు రాబోయే రోజుల్లో పెద్ద చెట్లు అవుతాయని, అరాచకాలకు కొమ్ముకాస్తున్న అధికారులకు జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి అధికారికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక అన్యాయం చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని స్పష్టం చేశారు. అధికారులు చంద్రబాబుకు కాకుండా ప్రజాస్వామ్యానికి, చట్టానికి సెల్యూట్ చేయాలని హితవు పలికారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం 'స్టార్టింగ్ లైన్' మాత్రమేనని, 2029 సాధారణ ఎన్నికలే 'ఫినిషింగ్ లైన్' అని పేర్కొన్న జగన్, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పట్టుదలే రాబోయే రోజుల్లో బాబు ప్రభుత్వాన్ని గద్దె దించుతుందని, పార్టీ ఎప్పుడూ ప్రజల గొంతుకై నిలబడుతుందని భరోసా ఇచ్చారు.