Begin typing your search above and press return to search.

జైలు గ్రిల్స్ దగ్గర జగన్ ...క్లిక్ మనిపించిన పోలీసులు

ఈ సందర్భంగా తనను అవమానించారు అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ములాఖత్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ హాట్ కామెంట్స్ చేశారు.

By:  Satya P   |   13 Aug 2026 11:37 PM IST
జైలు గ్రిల్స్ దగ్గర జగన్ ...క్లిక్ మనిపించిన పోలీసులు
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలు గ్రిల్స్ వద్ద ఉండగా పోలీసులు కెమెరా క్లిక్ మనిపించి ఫోటో తీశారు. ఇది కర్నూలు జిల్లాలోని జైలు వద్ద జరిగిన సన్నివేశంగా ఉంది. నిలబెట్టి మరీ తనను అలా జైలు గ్రిల్స్ వద్ద ఫోటో తీశారు అని జగన్ మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షని అరెస్టు చేసి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచిన నేపధ్యంలో ఆయన ములాఖత్ ద్వారా పరామర్శించారు. ఈ సందర్భంగా తనను అవమానించారు అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ములాఖత్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ హాట్ కామెంట్స్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రిని అంటూ :

తాను ఒక మాజీ ముఖ్యమంత్రిని అని ఆయన చెబుతూ ప్రోటోకాల్ కూడా పాటించకుండా నిలబెట్టి మరీ జైలు ఊచల వద్ద తనను ఫోటో తీశారు అని అన్నారు. ఇది చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. సాధారణంగా జైలులో ఎవరైనా ములాఖత్ కి వస్తే వారిని ముందు గదిలో కూర్చోబెట్టి ఫోటో తీసి ఆనక పంపిస్తారు అని చెప్పారు. నిబంధనలు ఇలా ఉంటే ఊచల పక్కన తనను పెట్టి నిలబెట్టి మరీ ఫోటోలు తీయించడమేంటని జగన్ ప్రశ్నించారు. ఇదే విషయం మీద తాను పోలీసులను ప్రశ్నిస్తే తమకు పై నుంచి ఈ మాదిరిగా ఆదేశాలు వచ్చాయని చెప్పారని అన్నారు. అందరికీ ఈ విధంగా జైలు ఊచల వద్దనే నిలబెట్టి ఫోటోలు తీస్తారా అని తాను పోలీసులను అడిగాను అని అలా అందరికీ చేయమని కూడా చెప్పారని అన్నారు.

విషపు విత్తులు అంటూ :

ఈ సందర్భంగా జగన్ చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విషపు విత్తులు నాటుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ల కాలం మీరే అధికారంలో ఉండరని గుర్తు చేస్తూ రేపటి రోజున మేము అధికారంలోకి వస్తే ఇవే విషపు విత్తనాల ఫలితాలు రెండింతలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదేమి విధానం అని ఆయన నిలదీశారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

పోలీస్ వర్సెస్ వైసీపీ :

ఇదిలా ఉంటే కర్నూల్ లో జగన్ పర్యటన అంతా ఉద్రిక్తతల నడుమ సాగడం విశేషం. ఒక వైపు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. వైసీపీ నేతల ర్యాలీలకు అనుమతులు లేవని చెప్పడంతో పలు చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఇక జగన్ కర్నూల్ ఎయిర్ పోర్టు నుంచి కర్నూల్ జైలు దాకా వెళ్ళే క్రమంలో ర్యాలీనే వైసీపీ నేతలు నిర్వహించారు. దీంతో పోలీసులు వైసీపీ నేతల మీద కేసులు ఫైల్ చేస్తామని హెచ్చరించారు. అయితే తమ అధినేత పర్యటనకు పోలీసులు ఆటంకాలు కల్పించారని పై నుంచి ప్రభుత్వ ఆదేశాలు రావడం వల్లనే వారు ఇలా చేశారు అని విమర్శించారు. మొత్తానికి చూస్తే జగన్ తాజా టూర్ కూడా వేడిగా వాడిగానే సాగింది. కొస మెరుపు ఏమిటి అంటే తనకు అవమానం జరిగింది అని జగన్ ఆరోపించడం. జగన్ ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎపుడూ ఈ తరహా ఆరోపణలు అయితే చేయలేదు, మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.