Begin typing your search above and press return to search.

పులివెందుల‌లో సంద‌డి.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న జోరు!

బుధ‌వారం వ‌రుస కార్యక్ర‌మాల్లో భాగంగా వేముల మండ‌లంలో కొత్త‌గా నిర్మించిన ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యం ప్రారంభోత్స వంలో జ‌గ‌న్ పార్టిసిపేట్ చేశారు.

By:  Garuda Media   |   24 Jun 2026 11:30 PM IST
పులివెందుల‌లో సంద‌డి.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న జోరు!
X

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌ర్య‌టిస్తున్నారు. దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఆయ‌న జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. త‌ర‌చుగా త‌న నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కు వెళ్తున్నా.. తాజా ప‌ర్య‌ట‌న‌లో మాత్రం జిల్లా వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర మాల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. ఏకంగా నాలుగు రోజుల ట్రిప్‌లో భాగంగా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డంతోపాటు.. ప‌లు కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్స‌వాలు చేశారు. దీంతో క‌డ‌ప జిల్లాలోను, మ‌రోవైపు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోనూ సంద‌డి నెల‌కొంది.

గ‌తానికి భిన్నంగా..

2024 త‌ర్వాత‌.. అంటే.. వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ప‌లుమార్లు పులివెందుల‌కు జ‌గ‌న్ వెళ్లారు. అయితే.. అప్ప‌ట్లో కొద్ది మంది కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుసుకోవ‌డానికి మాత్ర‌మే ఆయ‌న ప‌రిమితం అయ్యారు. అదేస‌మ‌యంలోపార్టీ కార్యాల‌యంలో విన‌తు లు తీసుకునేవారు. కానీ, ఈ సారి దానికి భిన్నంగా జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ముఖ్యంగా వైసీపీ విజ‌యం ద‌క్కించుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా కార్య‌క్ర‌మాల‌కు జ‌గ‌న్ హాజ‌రయ్యారు. ఇది ఒక‌ర‌కంగా ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీలో నెల‌కొన్న స్త‌బ్ద‌త‌ను కొంత మేర‌కు త‌గ్గించింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

బుధ‌వారం వ‌రుస కార్యక్ర‌మాల్లో భాగంగా వేముల మండ‌లంలో కొత్త‌గా నిర్మించిన ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యం ప్రారంభోత్స వంలో జ‌గ‌న్ పార్టిసిపేట్ చేశారు. విగ్ర‌హ ప్ర‌తిష్ఠాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సంప్ర‌దాయ వ‌స్త్ర ధార‌ణ‌తో ఆల‌యంలోకి అడుగు పెట్టిన జ‌గ‌న్‌.. స్వామి వారికి నిర్వ‌హించిన హోమ క్ర‌తువుల్లోనూ పాల్గొన్నారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేశారు. అదేవిధంగా పులివెందుల‌లోని యర్ర‌గుంట్ల‌లో ఎంపీ అవినాష్ రెడ్డి కేటాయించిన ఎంపీ నిధుల‌తో చేప‌ట్టిన ర‌హ‌దారుల నిర్మాణాలు పూర్త‌య్యాయి. ఈ ర‌హ‌దారుల‌ను జ‌గ‌న్ రిబ్బ‌న్ క‌ట్ చేసి ప్రారంభించారు.

పార్టీలో జోష్‌..

గ‌తానికి భిన్నంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డంతో పార్టీలో జోష్ క‌నిపించింది.కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు భారీ సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు. అయితే.. పోలీసులు మాజీ సీఎం హోదాలో జ‌గ‌న్ ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించారు. మ‌రోవైపు.. ఎక్క‌డికి వెళ్లినా.. ప‌లువురు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అదేస‌మ‌యంలో విన‌తి ప‌త్రాలు కూడా అందించారు. వాటిని స్వీక‌రించిన జ‌గ‌న్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇక‌, ఈ ప‌ర్య‌ట‌న‌లో వైసీపీ నాయ‌కులు అంద‌రూ పాల్గొన్నారు. ప్రొటోకాల్‌ను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్‌.. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం.. పార్టీలో ఐక్య‌త‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు క‌నిపించింది.