రప్పా.. రప్పా.. మార్మోగిన హైదరాబాద్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి హైదరాబాద్ పర్యటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అక్రమాస్తుల కేసులో కోర్టు వాయిదాకు వచ్చిన జగన్ కు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం చూపారు.
By: Tupaki Desk | 20 Nov 2025 7:24 PM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి హైదరాబాద్ పర్యటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అక్రమాస్తుల కేసులో కోర్టు వాయిదాకు వచ్చిన జగన్ కు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం చూపారు. వారి అభిమానాన్ని ఎవరూ కాదనకపోయినా, కొందరు అత్యుత్సాహంతో ‘2029లో రప్పా.. రప్పా’ అంటూ పోస్టర్లు ప్రదర్శించడమే అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కోర్టుకు వచ్చిన సమయంలో ఇలాంటి పోస్టర్లు ప్రదర్శించి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కొద్ది నెలల క్రితం జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లె పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ రప్పా.. రప్పా కటౌట్లు దర్శనమిచ్చాయి. తాము మళ్లీ అధికారంలోకి వస్తే టీడీపీ కార్యకర్తలను ‘రప్పా.. రప్పా’ నరికేస్తాం అంటూ పోస్టర్ ప్రదర్శించిన ఓ వైసీపీ కార్యకర్తను పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. ఇక ఈ తరహా బెదిరింపు రాజకీయాలే వైసీపీ మానటం లేదని టీడీపీ సోషల్ మీడియా తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే ఈ విషయంలో స్పందించిన జగన్ ‘రప్పా.. రప్పా’ అనేది సినిమా డైలాగ్ కదా? సినిమా డైలాగులు చెప్పినా తప్పే అంటారా? అంటూ అప్పట్లో వెనకేసుకొచ్చారు.
ఇక అప్పటి నుంచి జగన్ ఎక్కడికి వెళ్లినా రప్పా.. రప్పా డైలాగులు ఉన్న పోస్టర్లే జగన్మోహనరెడ్డికి స్వాగతం పలుకుతున్నాయి. చివరికి హైదరాబాదులో కోర్టుకు వచ్చిన సందర్భంలోనూ అవే పోస్టర్లను ప్రదర్శించడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్యకర్తలు అత్యుత్సాహంతో చేస్తున్న ఈ ప్రదర్శన పార్టీకి నష్టం చేస్తుందని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం ఈ రప్పా రప్పా డైలాగులను గతంలో ఒకసారి తప్పుబట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా, ఓ కార్యకర్త రప్పా రప్పా నినాదాలు చేయడాన్ని ఆయన వారించారు.
ఈ పరిస్థితుల్లో రప్పా.. రప్పాయే వైసీపీ ఎన్నికల నినాదంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అధికార కూటమి వైసీపీ ‘రప్పా.. రప్పా’ నినాదాలుపై తీవ్రంగా స్పందిస్తోంది. అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేస్తామని చెప్పకుండా.. రప్పా.. రప్పా అంటూ బెదిరింపులేంటి అంటూ ప్రశ్నిస్తోంది. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ ఆలోచన ఏంటీ అన్నది అంతుచిక్కడం లేదని అంటున్నారు. పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడానికి ఆయనే ఈ తరహా ప్రచారాన్ని కోరుకుంటున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
