జగన్ ఆశలు.. జనం నిరాశలు.. !
ఆశలు ఉండడం వేరు.. అత్యాసలు ఉండడం వేరు. వైసీపీ అధినేత జగన్ వ్యవహారానికి వస్తే.. ఆశల మాటున ఆయన అత్యాసలు కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 20 May 2025 12:00 PM ISTఆశలు ఉండడం వేరు.. అత్యాసలు ఉండడం వేరు. వైసీపీ అధినేత జగన్ వ్యవహారానికి వస్తే.. ఆశల మాటున ఆయన అత్యాసలు కనిపిస్తున్నాయి. ఇంకేముంది.. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారంతా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తమకే పట్టం కడతారని జగన్ అంచనాలు వేసుకుని భ్రమల్లో ఊరేగుతున్నారు. తాడేపల్లిలో తరచుగా నిర్వహిస్తున్న పార్టీ నాయకుల సమావేశాల్లో ఇవే విషయాలను ఆయన వెల్లడిస్తున్నారు.
అయితే.. జగన్ అనుకుంటున్నట్టుగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయా? అంటే.. కూటమి బలంగానే ఉంది కాబట్టి.. పొరపొచ్చాలు లేవు కాబట్టి.. ఆ అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా.. టీడీపీకే 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి.. జగన్‌కు ఛాన్స్ లేదు. ఇక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య కూడా భారీగా పెరిగిందని జగన్ చెబుతున్నారు. అయితే.. వాస్తవానికి కూటమి సర్కారు ఏర్పడి 11 మాసాలే అయింది కాబట్టి.. ఇంకా జగన్ భావిస్తున్న రేంజ్‌లో అయితే అసంతృప్తి రాలేదు.
అంతేకాదు.. శాంతి భద్రతలపై కూడా.. ప్రజలు పెద్దగా మొగ్గు చూపడం లేదు. పోలీసు స్టేషన్‌కు వెళ్తే.. తమకు ప్రాధాన్యం ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని మాత్రమే వారు చూసుకుంటున్నారు. అంతకు మించి.. వైసీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారని.. లేదా.. జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందని.. కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని సాధారణ ప్రజలు అయితే.. భావించడం లేదు. ఇక, మరో కీలక విషయం సూపర్ సిక్స్. దీనిపై కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని జగన్ చెబుతున్నారు.
ఇది వాస్తవమే. కానీ.. జగన్ అనుకున్న రేంజ్‌లో అయితే ఇది కూడా లేదు. సూపర్ సిక్స్‌ను అమలు చేయడం లేదన్న అసంతృప్తి జనంలో ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో పింఛన్లను పెంచి అమలు చేస్తుండడం.. ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం వంటివి ఈ సంతృప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
ఇక ప్రభుత్వం కూడా.. త్వరలోనే అంటూ.. సూపర్ సిక్స్‌ను మరిచిపోలేదని సంకేతాలు ఇస్తోంది. ఇలా ఏవిధంగా చూసుకున్నా.. జగన్ ఆశలు.. అయితే.. ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
