ఈడీ వలయంలో వైసీపీ.. నాలుగు కేసులతో కంగారెత్తిస్తున్న కేంద్ర సంస్థ
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులు, విచారణలతో ప్రతిపక్షం వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
By: Tupaki Desk | 13 Oct 2026 9:04 AM ISTకేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులు, విచారణలతో ప్రతిపక్షం వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం అవ్వాల్సిన సమయంలో ఎటువైపు నుంచి ఏ కేసు ముంచుకొస్తుందోనన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ప్రధానంగా నాలుగు కేసులతో వైసీపీపై ఈడీ ముప్పేట దాడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితులను ఈడీ విచారణకు పిలుస్తుండటమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక హత్య కేసులో ఈడీ జోక్యం చేసుకోవడం బహుషా ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన రెడ్డికి చెందిన పాత కేసులను రోజు వారీ విచారణ చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం కూడా హాట్ టాపిక్ అవుతోంది.
వైసీపీ నేతలకు చెందిన కేసులపై ఈడీ తీసుకుంటున్న చర్యలు రాజకీయంగా హాట్ హాట్ చర్చకు దారితీస్తున్నాయి. స్థానిక ఎన్నికల సమయంలో ఈ కేసుల విచారణ రచ్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన రెడ్డిని ఆయన సొంత జిల్లా, నియోజకవర్గంలో దెబ్బ తీసే లక్ష్యంతో మాజీ మంత్రి వివేకా హత్య కేసు మరోసారి తెరపైకి తీసుకువచ్చారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో జగన్ రెడ్డి బంధువులు కూడా నిందితులకు ఉండటం, పులివెందుల, కడప మున్సిపల్ ఎన్నికల్లో వారి పాత్ర కీలకం కావడంతో ఈ సందేహాలు మరింత ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి ఈడీ విచారణ ఎదుర్కొంటుండటమే వైసీపీని టెన్షన్ పెడుతోందని అంటున్నారు.
కీలకమైన సమయంలో ఈడీ విచారణకు హాజరుకావాల్సివుండటంతో రాజకీయ వ్యూహాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారని అంటున్నారు. అటు లిక్కర్ కుంభకోణంతోపాటు లిక్కర్ రవాణా స్కాంలో ఈడీ విచారణ వైసీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. ఈ కేసుల్లో ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, చిత్తూరుకు చెందిన వైసీపీ కీలక నేత విజయానంద రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయమై క్లారిటీ లేకపోయినా, ఎన్నికలకు ప్రచారం చేయాల్సిన సమయంలో వైసీపీ నేతలకు ఈడీ విచారణ ద్వారా చికాకు పెట్టే వ్యూహం అమలు అవుతుందా? అన్న అనుమానాలే ఉత్కంఠ రేపుతున్నాయి.
మొత్తం నాలుగు కేసుల విషయంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుండటం వైసీపీలో ఆందోళనకు కారణమవుతోందని అంటున్నారు. మాజీ సీఎం జగన్ రెడ్డి కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఈడీ కోరిన సమయం కూడా గమనించాల్సిన అంశమే అంటున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేసే అవకాశం ఉండటం, పదిహేనేళ్ల క్రితం నాటి కేసులను తిరిగి చర్చకు తీసుకురావాలనే వ్యూహమే దీని వెనుక ఉండొచ్చునని అంటున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చోటుచేసుకుందని ఆరోపిస్తున్న లిక్కర్ కేసు, వివేకా హత్య కేసులపై నిరంతరం ప్రజల్లో చర్చ జరిగేలా ఈడీ ద్వారా మరోసారి విచారణలు, అరెస్టులు చేయించడం ద్వారా వైసీపీపై ఒత్తిడి కొనసాగించాలని ప్రభుత్వ పెద్దలు వ్యూహారచన చేశారని అంటున్నారు.
