సడెన్ గా జగన్ ఢిల్లీ టూర్...మ్యాటర్ సీరియస్ ?
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 28 July 2025 12:59 AM ISTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా చంద్రబాబు దేశంలో లేనపుడు. జగన్ ఢిల్లీ టూర్ ఇపుడే ఎందుకు ఏమా తొందర అంటే మ్యాటర్ సీరియస్ అని అంటున్నారు. ఇక జగన్ ఈ మధ్య కాలంలో అయితే ఢిల్లీకి వెళ్ళినది లేదు. ఆయన గత ఏడాది అంటే వైసీపీ ఓడిన కొత్తల్లో ఒకసారి ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లారు. ఏపీలో పోలీసులు తమ పార్టీకి చెందిన వారి మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అన్న విషయం మీద వైసీపీ ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. ఆ సమయంలో ఎన్డీయే నేతలు తప్ప మిగిలిన పార్టీల నుంచి నాయకులు వచ్చారు.
సుదీర్ఘకాలం తరువాత మళ్ళీ :
ఇంతకాలం తరువాత జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఇందులో విషయం చాలానే ఉంది అని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసి గత వైసీపీ అయిదేళ్ళ పాలనలో సాగిన లిక్కర్ స్కాం మీద విచారణను జరిపిస్తోంది. ఇదిపుడు లాజికల్ ఎండింగ్ కి వచ్చిందని అంటున్నారు. ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు తరువాత జగన్ కచ్చితంగా అరెస్టు అవుతారు అని అంతా చెబుతున్నారు. ప్రచారం చూసినా ఆ విధగానే సాగుతోంది. దాంతో జగన్ ఇదే పని మీద ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు.
అటు బీజేపీ పెద్దలతోనూ :
ఇక జగన్ ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారు అన్నది మరో చర్చ. కేంద్రంలో బీజేపీకి చెందిన నాయకులను ఆయన కలుస్తారు అని ప్రచారం సాగుతోంది. అలాగే ఇతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో కూడా భేటీ అయి ఏపీలో లిక్కర్ స్కాం పేరుతో వైసీపీ మీద రాజకీయ దాడి జరుగుతోంది అని జగన్ చెప్పబోతున్నారు అని అంటున్నారు. ఆ విధంగా ఏపీలో లిక్కర్ స్కాం అంశాన్ని జాతీయ స్థాయిలో ఉంచి వైసీపీ మీద అది రాజకీయ ప్రతిదాడిగా జగన్ వివరించబోతున్నారు అని అంటున్నారు.
కుట్రగా చెప్పదలచారా :
ఏపీలో వైసీపీకి తనకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని జగన్ ఢిల్లీ వేదికగా చెప్పదలచారు అని అంటున్నారు. నిజానికి చూస్తే గత ఏడాది ఈ కేసు తెర మీదకు వచ్చింది. మొదట సీఐడీతో విచారణ జరిపించారు. అనంతరం సిట్ కి అప్పగించారు. అయితే సిట్ విచారణ తరువాత నెమ్మదిగా నేతలను అందరినీ అరెస్టు చేస్తూ వస్తోంది. ఇక జగన్ అరెస్టు మీద చర్చ ఊపందుకున్న నేపధ్యంలోనే ఆయన ఢిల్లీలో జాతీయ పార్తీలకు కలిసేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో రాజకీయంగా ఏమి జరుగుతోంది అన్నది వైసీపీ కోణం నుంచి వారికి వివరించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
సానుభూతి కోణమేనా :
ఈ లిక్కర్ స్కాం లో జగన్ అరెస్టు అనివార్యం అని కూటమి నేతలు చెబుతున్నారు. జగన్ సైతం అరెస్టుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. తాను తాడేపల్లిలోనే ఉన్నానని అరెస్టు చేసుకోవచ్చు అన్నట్లుగా ఆయన కొన్నాళ్ళ క్రితం మీడియా ముందే చెప్పారు. సో ఇపుడు అరెస్టు జరుగుతుంది అన్న ప్రచారం వేళ ఆయన ఢిల్లీకి పయనం అవుతారు అన్నది చూస్తే సానుభూతి కోణంలోనే దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారా అన్న చర్చ వస్తోంది. తాను అరెస్టు అయితే అది జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
వైసీపీకి మద్దతు ఎంత :
ఇక ఏపీలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీగా వైసీపీ ఉంది. దాంతో తనకు జాతీయ స్థాయిలో మద్దతు కావాలని ఆయన అనేక పార్టీలను కోరే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే జగన్ కి మద్దతుగా నిలిచే పార్టీలు ఏవి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఎన్డీయే నుంచి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు దక్కే సీన్ ఉండదనే అంటున్నారు. ఇండియా కూటమి విషయం తీసుకుంటే జగన్ వారితో మొదటి నుంచి దూరంగా ఉంటున్నారు. ఇపుడు వైసీపీకి అవసరం పడిందని ఆ పార్టీలు ముందుకు వచ్చి మద్దతు ఇస్తాయా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ సడెన్ ఢిల్లీ టూర్ మాత్రం ప్రచారంలో ఉంది. ఆయన ఢిల్లీ వెళ్ళడం అంటూ జరిగితే అది సంచలనమే అవుతుంది అని అంటున్నారు.
