Begin typing your search above and press return to search.

కమ్యూనిస్టులతో దోస్తీ.. జగన్ ప్లాన్ అదేనా..?

ఇంతకాలం కమ్యూనిస్టు పార్టీలను, ముఖ్యంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్, ఇప్పుడు అదే వర్గంతో సాగిస్తున్న మంతనాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

By:  Garuda Media   |   26 Sept 2026 11:00 PM IST
కమ్యూనిస్టులతో దోస్తీ.. జగన్ ప్లాన్ అదేనా..?
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఊహించని పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్న శత్రు శిబిరాలు, ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలిలో వస్తున్న ఈ అనూహ్య మార్పులు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇంతకాలం కమ్యూనిస్టు పార్టీలను, ముఖ్యంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్, ఇప్పుడు అదే వర్గంతో సాగిస్తున్న మంతనాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా సీపీఐ నేతలు నేరుగా తాడేపల్లికి వెళ్లి జగన్‌ను కలవడం, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఈ నెల 26న విజయవాడలో నిర్వహించబోయే తమ రౌండ్ టేబిల్ సమావేశానికి ఆహ్వానించడం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదనేది స్పష్టమవుతోంది. ఈ పొత్తుల పరతంత్ర వెనుక జాతీయ స్థాయి ‘ఇండియా’ కూటమి పెద్దల వ్యూహం ఉందన్న వాదన బలపడుతోంది. ఏపీలో ఒంటరి పోరాటం చేస్తున్న తమ పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడంతో పాటు, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి వైపు జగన్‌ను ఆకర్షించేలా కమ్యూనిస్టులను మధ్యవర్తులుగా మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది.

మరోవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఇప్పటివరకు సత్సంబంధాలు కొనసాగించిన జగన్.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక, తనపై ఉన్న కేసుల విచారణను, ఈడీ దూకుడును తట్టుకోవడానికి ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పుడు కమ్యూనిస్టులతో చేతులు కలపడం ద్వారా ఢిల్లీ పెద్దలకు ఒక బలమైన సంకేతం పంపుతున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అవసరమైతే కాంగ్రెస్ కూటూమితో జతకట్టడానికి కూడా వెనుకాడబోమనే సంకేతాలు పంపి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే రాజకీయ బ్లాక్‌మెయిలింగ్ వ్యూహానికి జగన్ తెరతీశారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఏదేమైనప్పటికీ, ఈ రాజకీయ మార్పులు కేవలం స్వల్పకాలిక ప్రయోజనాలకే పరిమితం కాకపోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న తీవ్ర విభజనల మచ్చను, సిద్ధాంత వైరుధ్యాలను పక్కనపెట్టి జగన్ వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. ప్రస్తుతానికి బీజేపీని అప్రమత్తం చేయడానికి, జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకోవడానికి కమ్యూనిస్టులను జగన్ ఒక ఆయుధంగా వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ కొత్త దోస్తీ కేవలం తాత్కాలిక రాజకీయామా లేక రాబోయే ఎన్నికల నాటికి మహా కూటమికి పునాదా అన్నది కాలమే నిర్ణయించాలి.