జగన్ కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 20 నుంచి టూర్
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By: Tupaki Political Desk | 17 April 2026 1:49 PM ISTమాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ ఆయన యూరప్, యూకీ పర్యటనకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. లండన్ లో ఉంటున్న కుమార్తెల వద్దకు వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా, జగన్ పిటిషన్ వేశారు. ఏటా ఆయన కోర్టు అనుమతితో వేసవికాలంలో రెండు లేదా మూడు వారాలు కుమార్తెల వద్దకు వెళుతుంటారు.
ఏటా మాదిరిగానే విదేశాలకు వెళ్లేందుకు జగన్ కోర్టు అనుమతి కోరారు. జగన్ విజ్ఙప్తిపై సానుకూలంగా స్పందించిన కోర్టు కొన్ని షరతులు విధించింది. రూ.లక్ష పూచీకత్తు చెల్లించడంతోపాటు పర్యటన వివరాలు, అందుబాటులో ఉండే ఫోన్ నంబరును కోర్టు, సీబీఐకి ఇవ్వాలని సూచించింది. పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, బస చేసే హోటళ్లు లేదా నివాసాల వివరాలు, అక్కడ ఉపయోగించే ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ అడ్రస్‌లను ముందుగానే సమర్పించాలని స్పష్టం చేసింది.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరు కావాలని లేదా వ్యక్తిగతంగా హాజరు కాలేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేసు విచారణలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదని కోర్టు హెచ్చరించింది. గతంలో కూడా జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. అయితే, గత కొన్ని పర్యటనల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సిబిఐ గతంలో ఆరోపించిన నేపథ్యంలో, ఈసారి కోర్టు నిబంధనలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. తాజా ఉత్తర్వులతో జగన్ విదేశీ పర్యటనకు ఉన్న అభ్యంతరాలు తొలగిపోయాయి.
