"ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్" ధ్వజమెత్తిన టీడీపీ
కాగా, సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పించ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు.
By: Tupaki Desk | 18 Jun 2025 3:16 PM ISTమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణకు వెళుతున్న జగన్ కాన్వాయ్ ఢీకొని గుంటూరు శివార్లలోని ఏటుకూరు బైపాస్ వద్ద ఓ వృద్ధుడు మరణించాడు. అయితే సంఘటన జరిగిన తర్వాత మాజీ సీఎం జగన్ కనీస మానవత్వం చూపలేదని, తన కాన్వాయ్ ని ఆపలేదని ఆరోపిస్తూ టీడీపీ ట్వీట్ చేసింది. "ఇంకా ఎంతమందిని బలితీసుకుంటావ్" అంటూ మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించింది టీడీపీ.
జగన్ గుంటూరు పర్యటనలో వృద్ధుడు మరణించడాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. ‘‘జగన్ రెడ్డి ప్రచార పిచ్చకి మరోకరు బలయ్యారు. సత్తెనపల్లి వెళ్తూ, ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్వాయ్ ఢీ కొట్టింది. కనీస మానవత్వం లేకుండా, గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోయారు’’ అంటూ టీడీపీ తన ట్వీట్ లో ఆరోపించింది. అంతేకాకుండా క్షతగాత్రుడిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించినా, తీవ్రగాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయాడంటూ ఆ ట్వీట్ లో తెలిపింది. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్? అన్న ప్రశ్నతో టీడీపీ తన ట్వీట్ ను వైరల్ చేస్తోంది.
కాగా, సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పించ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేయగా, దానిని ఆవిష్కరించేందుకు మాజీ సీఎం జగన్ వెళ్లారు. అయితే జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడంపై వైసీపీ విమర్శిస్తోంది. ఇదే సమయంలో యోగా దినోత్సవానికి ముందు కుట్ర చేయడానికే జగన్ రెంటపాళ్ల పర్యటనకు వస్తున్నారని గుంటూరు టీడీపీ ప్రతి విమర్శలు చేస్తోంది. ఎన్నికల్లో బెట్టింగ్ కాసిన నాగ మల్లేశ్వరరావు ఓడిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ చెబుతుండగా, పోలీసుల వేధింపులే ఆయన ఆత్మహత్యకు కారణమని వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో జగన్ సత్తెనపల్లి పర్యటన ఉద్రిక్తంగా మారింది.
