18 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది? జగన్ షాకింగ్ కామెంట్స్
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందన హాట్ టాపిక్ అవుతోంది.
By: Tupaki Political Desk | 14 July 2026 5:51 PM ISTమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందన హాట్ టాపిక్ అవుతోంది. రోడ్డు ప్రమాదం చేసిన ఆరవ్ వర్మను తాను సమర్థించడం లేదని, కానీ అతడిపై హత్య కేసు నమోదు చేస్తారా? అంటూ ఆక్షేపించారు. అయితే 18 ఏళ్ల పిల్లాడు రోడ్డు ప్రమాదం చేశాడు? అతడికి ఏం తెలుస్తుందంటూ జగన్ రెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపాయి. 18 ఏళ్ల పిల్లాడు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైతే చర్యలు తీసుకోకుండా వదిలేయాలా? అంటూ నెటిజన్లు ప్రశ్నలతో దండెత్తుతున్నారు.
రోడ్డు ప్రమాదం చేసిన సీదిరి కుమారుడిని తాను సమర్థించడం లేదంటూ జగన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అతని వయసు 18 ఏళ్లు. యాక్సిడెంట్స్ అన్నాక జరుగుతాయి... అందుకని 18 ఏళ్ల పిల్లాడు మీద మర్డర్ కేసు పెడతారా? అంటూ జగన్ ఫైర్ అయ్యారు. ‘‘మర్డర్ కేసు పెట్టడం ఏంటి?’’ అని జడ్జ్ తీవ్రంగా మందలిస్తే పోలీసులు సెక్షన్లు మార్చారని మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, రోడ్డు ప్రమాదంపై జగన్ రెడ్డి స్పందన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. నిజానికి రోడ్డు ప్రమాదం ఎవరు చేసినా కేసులు నమోదు చేయడం సాధారణమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిందితుడు వైసీపీకి చెందిన మాజీ మంత్రి కుమారుడు అయినంత మాత్రాన కేసు పెట్టకుండా వదిలేయాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సహజంగా ప్రమాదశాత్తూ జరిగే ఇటువంటి ఘటనలకు స్టేషన్ బెయిలు మంజూరు చేస్తుంటారు. అయితే మాజీ మంత్రి సీదిరి తన కుమారుడిని పోలీసు కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం, ఆ విషయాన్ని పత్రికలు, అధికార పార్టీ నేతలు బయటపెట్టడంతో వివాదాస్పదమైందని చెబుతున్నారు.
ఈ విషయంపై మాజీ సీఎం జగన్ రెడ్డి స్పందించడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. జగన్ రెడ్డి మాట్లాడిన వీడియోపై వందల సంఖ్యలో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. తప్పు చేస్తే మీ వాడని వదిలేయాలా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎల్ఎల్ఆర్ లైసెన్సు తీసుకున్న యువకుడు ఒక్కడు బండి నడపడం తప్పని, ఆ సమయంలో వెనక అనుభవం ఉన్న వారు ఉండాలని, అదే సమయంలో బండిపై ఎల్ బోర్డు ఉంచాలని నిబంధనలు ఉన్న విషయాన్ని చెబుతున్నారు. మాజీ మంత్రి కుమారుడి విషయంలో ఇవేవీ పాటించకపోవడంతోనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపారని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం వైసీపీ అధినేత జగన్ రెడ్డి స్పందించి ట్రోలింగ్ కు గురవుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
