Begin typing your search above and press return to search.

జగన్ చిత్తూరు పర్యటనలో కార్యకర్తలకు గాయాలు.. కారు దిగకుండా అడ్డుకున్న ఎస్పీ

మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. మామిడి రైతుల పరామర్శకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 July 2025 12:54 PM IST
జగన్ చిత్తూరు పర్యటనలో కార్యకర్తలకు గాయాలు.. కారు దిగకుండా అడ్డుకున్న ఎస్పీ
X

మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. మామిడి రైతుల పరామర్శకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటిస్తున్నారు. ఆయనను చూసేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాగా, వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయని చెబుతున్నారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ కారు దిగేందుకు ప్రయత్నిస్తే, కాన్వాయ్ లోనే వెళ్లాలని, కారు దిగేందుకు అనుమతి లేదని ఎస్పీ మణికంఠ సూచించారు. మాజీ సీఎం కారు దిగకుండా అడ్డుకోవడంతో కార్యకర్తలు మరింతగా ఎగబడ్డారు.

మామిడి రైతుకు గిట్టుబాటు కల్పించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ప్రైవేటు మార్కెట్ యార్డుకు వచ్చారు. అయితే ఈ పర్యటనకు కేవలం 500 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ముందుగా చెప్పారు. అయితే వైసీపీ మాత్రం జగన్ పర్యటనకు భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టింది. దీంతో బంగారుపాల్యంలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పోలీసులు బంగారుపాళ్యంను దిగ్బంధించారు. జగన్ కాన్వాయ్ వాహనాలను లెక్కించి పంపుతున్నారు. భారీ జనసమీకరణ లేకుండా పకడ్బందీగా ఆంక్షలు అమలు చేస్తున్నారు.

పోలీసుల ఆంక్షలతో వైసీపీ కూడా జగన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దీటుగా పనిచేస్తోంది. వేల మంది కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చింది. జగన్ పర్యటనకు 10 వేల మంది వస్తారని ముందుగానే తాము అనుమతి కోరామని, కానీ, పోలీసుల ద్వారా జగన్ ను అడ్డుకునేందుకు 500 మందికి మాత్రమే అనుమతిచ్చారని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ పర్యటన విజయవంతం చేస్తామని ప్రకటించింది. కాగా, గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద గతంలో జరిగిన ప్రమాదం దృష్ట్యా జగన్ కారుపైకి కార్యకర్తలు ఎగబడకుండా పోలీసులు కార్యకర్తలను అదుపు చేస్తున్నారు. కానీ, కార్యకర్తలు మాత్రం పోలీసులను నెట్టుకుని జగన్ తో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు.