Begin typing your search above and press return to search.

భారీ ఓటమి తరువాత అక్కడికి జగన్ !

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా కాలానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే సత్తా కలిగిన ప్రాంతం అది.

By:  Satya P   |   7 July 2026 4:00 AM IST
భారీ ఓటమి తరువాత అక్కడికి జగన్ !
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా కాలానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే సత్తా కలిగిన ప్రాంతం అది. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి మొత్తానికి మొత్తం సీట్లు పట్టం కట్టి వైసీపీకి జీరో మార్కులు వేసిన కీలక రాజకీయ స్థావరమది. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు అయిన గోదావరి జిల్లాలలో తమ పర్యటనకు జగన్ శ్రీకారం చుడుతున్నారు. జగన్ ఇప్పటిదాకా రెండేళ్ళ కాలంలో అడపా దడపా పరామర్శలు చేశారు. ఎక్కువగా క్రిష్ణా గుంటూరులలోనే ఆయన పర్యటనలు సాగాయి. మధ్యలో విశాఖ దాకా వచ్చారు. అయితే జగన్ తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి వస్తున్నారు.

వారితో కలసి ఆందోళన :

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగన్ పర్యటన ఈ నెల 15న ఉండబోతోంది. ఆక్వా రైతులను పరామర్శించి వారి సాధక బాధలను వినేందుకు జగన్ వస్తున్నారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మధ్యనే ఆక్వా రైతులు తమ సమస్యలను జగన్ కి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కలసి తెలియచేశాయి. ఆ సమయంలో వారికి అండగా ఉంటూ వైసీపీ పోరాటం చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే జగన్ పర్యటన భీమవరంలో పెట్టుకున్నారు అని అంటున్నార్. ఆక్వా రైతులను టీడీపీ కూటమి ప్రభుతం రెండేళ్ళ కాలంలో ఆదుకోలేదని వైసీపీ విమర్శిస్తోంది. సిండికేట్ యాజమాన్యాలు దళారులు కుమ్మక్కు అయి ఫీడ్ రేట్లు భారీగా పెంచేసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్వా రైతులు ఆందోళనలో ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

ఫీడ్ రేట్లు తగ్గించినా :

ఇదిలా ఉంటే ఫీడ్ రేట్లు కొంత తగ్గించినా ఇంకా ఆక్వా రైతులు ఇబ్బందులలోనే ఉన్నారు అని అంటున్నారు. దాంతో ఆక్వా రైతులను స్వయంగా కలసి వారి సాధక బాధకాలను జగన్ వింటారు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సందర్భంగా ఆక్వా రైతులను ఆదుకునేందుకు వైసీపీ తరఫున కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

వ్యూహం ఇదేనా :

ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలు వైసీపీని 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దెబ్బేశాయి. దాంతో వైసీపీ అధికారంలోకి రావడం పక్కన పెడితే ప్రతిపక్షంలోకి కూడా వచ్చేందుకు అవసరమైన సీట్లు అందుకోలేకపోయింది. ఈ క్రమంలో రెండేళ్ళ పాలన తరువాత జగన్ గోదావరి బాట పట్టారు అని అంటున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలన్నది రాజకీయ జీవులు చెప్పే మాట. ఆ విషయంలో వైసీపీ అధినాయకత్వం కూడా సరైన దారి ఇదే అని గోదావరి జిల్లాలా బాట పడుతోంది అని అంటున్నారు. ఆక్వా రైతుల సమస్యలనే ఆయుధంగా చేసుకుని కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే పోరాటం చేయాలన్నది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. మరి రాక రాక చాలా కాలానికి భీమవరం వస్తున్న జగన్ కి ఏ విధమైన రిసీవింగ్ ఉంటుంది, వైసీపీకి గోదావరి పల్స్ ఏ విధంగా చిక్కుతాయన్నది వేచి చూడాల్సి ఉంది.