‘మాట్లాడేందుకు టైమిస్తే.. సభకు వస్తా’ జగన్ వ్యాఖ్యలు ఎవరితో?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా తన పార్టీ ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం.
By: Garuda Media | 19 Sept 2025 10:48 AM ISTఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి అసెంబ్లీ సమావేశాలకు తూతూ మంత్రంగా హాజరవుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా తన పార్టీ ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. సభకు హాజరయ్యే విషయంపై ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమయంలో జగన్ స్పందించిన తీరు.. పార్టీలోనూ చర్చగా మారింది. దీనికి కారణం.. జగన్ రియాక్టు అయిన తీరేనని చెప్పాలి.
ఎమ్మెల్యేలందరితో పాటు మీకు టైమిస్తామని వాళ్లు అంటున్నారని.. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చినట్లుగా కొన్ని నిమిషాలు టైమిస్తే తానేం మాట్లాడతానని.. ప్రజా సమస్యల గురించి వివరంగా చెప్పగలనా? అని ఎదురు ప్రశ్న వేసినట్లుగా చెబుతున్నారు.ఈ మాటలకు స్పందించిన ఒక ఎమ్మెల్యే.. సభకు వస్తే మాట్లాడేందుకు సమయమిస్తామని స్పీకర్ చెబుతున్నారు కదా? అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించటంతో స్పందించిన జగన్.. ‘నువ్వు.. ఇంకా మనోళ్లు ఎవరైనా వస్తే అందరూ వెళ్లి స్పీకర్ ను కలిసి అడగండి. తగిన టైమిస్తానని హామీ ఇస్తే.. సభకు రేపే వస్తా’ అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు.. సభకు రావాలని.. మాట్లాడేందుకు అవకాశమిస్తామని చెబుతారని.. కానీ వాస్తవంలో జరిగేది వేరుగా ఉంటుందన్న జగన్.. ‘ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా ఫర్లేదు.. మాట్లాడేందుకు టైమిస్తాని హామీ ఇస్తే చాలు. మొన్న రెండు.. మూడు అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రజంటేషన్ ఇస్తే గంటపైనే పట్టింది. అలా ప్రజా సమస్యలపై సభలో వివరించేందుకుటైమిస్తా.. ఎమ్మెల్యే మాదిరి టైమిస్తానని అంటే మాత్రం ఏం చేయగలం’ అని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
సభకు వెళ్లనప్పటికి.. ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించినట్లుగా చెప్పిన జగన్. ప్రతిపక్ష మోదా ఇవ్వకపోవటంపై కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు నుంచి స్పీకర్ కు సమన్లు అందిన తర్వాత స్పీకర్ జవాబు ఇవ్వటం లేదన్న జగన్ మరిన్ని అంశాల్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. తాను అరవై రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని మాట్లాడుతున్నారని.. మరి చంద్రబాబు సభకు రాకపోతే వేటు పడిందా? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను గవర్నర్ ప్రసంగ సమయంలో హాజరైన విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో తనకు ప్రత్యేక హామీ స్పీకర్ నుంచి వస్తే తప్పించి.. హాజరయ్యేది లేదన్న విషయాన్ని పార్టీ నేతల ఎదుట స్పష్టం చేసినట్లైంది. మరి.. దీనిపై స్పీకర్ స్పందించే అవకాశం ఉందా? అన్నది వేచి చూడాలి.
