అసెంబ్లీకి జగన్...క్లారిటీ ఇచ్చిన రఘురామ
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గత రెండేళ్ళుగా అసెంబ్లీకి వెళ్ళింది వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.
By: Satya P | 8 April 2026 12:07 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గత రెండేళ్ళుగా అసెంబ్లీకి వెళ్ళింది వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. గట్టిగా చెప్పాలీ అంటే మూడే మూడు సార్లు ఆయన అసెంబ్లీకి వచ్చారు అని అంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి, మరో రెండు సార్లు బడ్జెట్ సెషన్ ప్రారంభానికి జగన్ అసెంబ్లీకి వచ్చారు. ఇంకా రెండు బడ్జెట్ సెషన్లు ఉన్నాయి. ఇందులో 2027లో అయితే జగన్ హాజరు కావచ్చు. ఆ ఏడాదే ఆయన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడతారు. దాంతో 2028లో బడ్జెట్ సెషన్ కి రాకపోవచ్చు అని అంటున్నారు. అంటే అయిదేళ్ల అసెంబ్లీలో అయిదు సార్లు అయినా సభకు జగన్ వస్తారా అంటే అది పెద్ద డౌటే అని అంటున్నారు.
డిప్యూటీ స్పీకర్ అంచనా :
ఇదిలా ఉంటే ఒక ప్రముఖ తెలుగు చానల్ కి రఘురామ క్రిష్ణం రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ అసెంబ్లీకి వస్తారా అని యాంకర్ ప్రశ్నించారు. మిమ్మల్ని అధ్యక్షా అని ఆయన పిలుస్తారా అలా పిలిపించుకునే అవకాశం మీకు ఉందా అని కూడా యాంకర్ అడిగారు. దానికి రఘురామ స్పష్టంగానే జవాబు చెప్పారు. జగన్ అసెంబ్లీకి రారు అని. తనకు ఉన్న అంచనా ప్రకారం చూస్తే జగన్ రారు అనే అనుకుంటున్నాను అని ఆయన చెప్పారు. ఇక జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోతే యాక్షన్ తీసుకుంటారా జగన్ మీద పగ ఇంకా అలగే ఉందా అన్న దానికి రఘురామ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పగ లేదు కానీ :
తనకు జగన్ మీదనే కాదు ఎవరి మీద కూడా పగ ఉండదని అన్నారు. కోపం అయితే ఉంటుందని అన్నారు. ఇక జగన్ విషయమే తీసుకుంటే తాను ఎంపీగా ఉన్నపుడు హైదరాబాద్ లో ఉంటే పోలీసులను పంపించి తనను దారుణంగా ఇబ్బందుల పాలు చేసి గుంటూరు సీఐడీ ఆఫీసుకు తెచ్చారని గుర్తు చేశారు. జగన్ నిజానికి అంతలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కాదని అన్నారు. తన విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆనాడు పిలిచి మాట్లాడి ఉండాల్సింది అని రఘురామ అన్నారు. ఆనాడు పోలీసులు తనను విచారణ పేరుతో హింసించారని, తాను కనుక ఆనాడు చనిపోయి ఉంటే ఏమయ్యేది అని ఆయన ప్రశ్నించారు. జగన్ రాజకీయానికే ఇలాంటివి నష్టం కదా అని ఆయన చెప్పడం విశేషం.
ఫిక్స్ అయినట్లేనా :
ఇదిలా ఉంటే ఉప సభాపతి హోదాలో రఘురామ జగన్ విషయంలో ఈ రకంగా అంచనా వేసుకున్నారు అంటే జగన్ సభకు ఈ అయిదేళ్ళ టెర్మ్ లో హాజరు కారు అని కూటమి పెద్దలు కూడా ఫిక్స్ అయినట్లే అని అంటున్నారు. మరో వైపు చూస్తే సభకు గైర్ హాజరు అయ్యే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునేందుకు సభా నిబంధనలు అయితే ఉన్నాయా లేవా అన్న దాని మీద చర్చ సాగుతోంది. ఈ విషయంలో పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆ మధ్యన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతి చేశారు. అంటే పార్లమెంట్ లో కనుక ఈ తరహా గైర్ హాజర్ అయ్యే ప్రజా ప్రతినిధుల మీద చర్యలకు ఒక రూలింగ్ ఇచ్చి నిబంధనలు రూపొందిస్తే అవి రాష్ట్రాలు సైతం అమలు చేస్తాయని అంటున్నారు.
వైసీపీ వ్యూహం :
ఇంకో వైపు వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు చూస్తే ఇప్పటికే రెండేళ్ళు అయిందని మరో ఏడాది గడిస్తే తమ మీద చర్యలు తీసుకునేందుకు ఎటూ అధికార పక్షం సాహసించదని అప్పటికి ఏపీలో ఎన్నికల మూడ్ వస్తుందని భావిస్తోంది అంటున్నారు. ఈ విధంగానే ఏడాదికి ఒకసారి బడ్జెట్ సెషన్ కి హాజరై అరవై పని దినాలలో ఒక్క రోజు అయినా సభకు అటెండ్ అయితే చాలు అన్న నిబంధన పాటిస్తే చాలు అన్నట్లుగా వ్యూహంతో ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి అసెంబ్లీ సెషన్ లో జగన్ అటు వైపు బాబు పవన్ ఇటు వైపు ఉంటూ జరిగే వాడి వేడి చర్చలను చూసే చాన్స్ లేదనే అంటున్నారు.
