Begin typing your search above and press return to search.

జగన్ చెప్పిన టెంట్ హౌస్ రాజకీయం

మున్సిపల్ ఎన్నికలలో కూటమి రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వాగ్బాణాలు సంధించారు.

By:  Tupaki Political Desk   |   18 Oct 2026 7:15 PM IST
జగన్ చెప్పిన టెంట్ హౌస్ రాజకీయం
X

మున్సిపల్ ఎన్నికలలో కూటమి రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వాగ్బాణాలు సంధించారు. కూటమిలో సీట్ల సర్దుబాటును టెంట్ హౌసుతో పోల్చిన మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తన పార్టనర్ షిప్ పార్టీకి లీడర్లను సప్లై చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, రిజర్వేషన్లను ముందే తెలుసుకుని తన అభ్యర్థులను పోటీకి పెడుతున్న అధికారపక్షం ప్రతిపక్షానికి కనీస సమయం ఇవ్వలేదని ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికలలో కూటమి ప్రభుత్వ వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీకి కుల ధృవీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా తమ పార్టీ వారిని ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తనకు కావాల్సిన విధంగా ఇష్టానుసారం రిజర్వేషన్లు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలపై బైండోవర్ కేసులు పెడుతూ పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు జగన్ ఆరోపించారు. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు ధైర్యంగా వైసీపీని ఎదుర్కోలేకపోతున్నారని జగన్ విమర్శలు గుప్పించారు.

నామినేషన్లు తీసుకోవడం లేదు

పులివెందుల, పుంగనూరు, కడప వంటి ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే వైసీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నామినేషన్ పత్రాలు తీసుకోవడం లేదని, నామినేషన్ కేంద్రాల్లో టీడీపీ గుండాలు ఉంటున్నారని జగన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. తమ హయాంలో టీడీపీకి అనుకూలంగా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా పనిచేశారని, ఆయన ఎందరో అధికారులను బదిలీ చేసినా తాము క్లీన్ స్వీప్ చేశామని గుర్తు చేశారు.

మిథున్ కు మద్యం అలవాటుపై..

ఈ సందర్భంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై మాజీ సీఎం జగన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ లో మద్యం సీసాలు ఉండటంపై అధికార కూటమి నేతలు విమర్శలు చేయగా, జగన్ రెడ్డి స్పందించారు. మిథున్ రెడ్డికి నా మాదిరిగా మద్యం అలవాటు లేదు అంటూ జగన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.