Begin typing your search above and press return to search.

జగన్ ఒక వైపే చూస్తున్నారా...ఇబ్బందే మరి !

మరి సంక్షేమం విషయం వరకూ జగన్ ఓకే అనుకున్నా అభివృద్ధి విజన్ ఏదీ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

By:  Satya P   |   20 March 2026 5:00 PM IST
జగన్ ఒక వైపే చూస్తున్నారా...ఇబ్బందే మరి !
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వైపే చూస్తున్నారు, ఒక వైపే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయన మీడియా ముందు మాట్లాడుతున్న తీరు కానీ పార్టీ సమావేశాలలో ఇస్తున్న ప్రకటనలు కానీ చూస్తే ఒక విషయం అర్ధం అవుతోంది ఏపీలో 2029 ఎన్నికల్లో వైసీపీని జనాలు తప్పకుండా ఎన్నుకుంటారని ధీమాతో ఉన్నారు. దానికి కారణం తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అని బలంగా నమ్ముతున్నారు. తాజాగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒంగోలు పార్టీ నేతల మీటింగులో సైతం జగన్ ఇదే విషయం గట్టిగా ప్రస్తావించారు.

ప్రతీ ఇంట్లో చర్చ :

తమ అయిదేళ్ల పాలన మీద కూటమి ఇరవై నెలల పాలన మీద ప్రతీ ఇంట్లో చర్చ సాగుతోందని జగన్ అంటున్నారు. తాము ఏకంగా రెండు లక్షల 70 వేల కోట్ల రూపయాల పై చిలుకు సంక్షేమంగా ప్రతీ ఇంటికీ నగదు బదిలీగా అందచేశామని జగన్ చెప్పారు. కరోనా లాంటి విపత్తు ఉన్నా వెనకాడలేదని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. అందువల్ల కూటమి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఎన్ని చెప్పినా తమ లాగా జనాలకు సంక్షేమ పధకాలు అందించడంతో విఫలం అవుతోంది అని అన్నారు. ఈ తేడాను ఇప్పటికే జనాలు గుర్తించారని అందుకే తమకే పట్టం కడతారని జగన్ అంటున్నారు. ఆయన వరకూ ఈ విశ్లేషణ బాగుంది, అందులో కొంత నిజం ఉంది, కానీ కేవలం సంక్షేమం విషయాన్ని మాత్రమే జనాలు పరిగణనలోకి తీసుకుని ఓట్లేస్తారా అన్న చర్చ సాగుతోంది.

అభివృద్ధి మంత్రంతో :

ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అభివృద్ధి అని అంతా చెబుతారు. ఆయన సంక్షేమం కంటే దానికే ఎక్కువ ఫోకస్ పెడతారు. అలాంటి బాబు ఏపీలో వైసీపీని గట్టిగా దెబ్బ తీయాలని సంక్షేమం రూట్ కూడా ఎంచుకున్నారు. అలా బాబు ఒక వైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి రెండింటికీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రతీ మీటింగులోనూ ఈ రెండూ చెబుతున్నారు. అమరావతి రాజధాని ప్రగతిని వివరిస్తున్నారు. పోలవరం ఎపుడు పూర్తి అవుతుందో చెబుతున్నారు. పెట్టుబడులు ఏపీకి ఎన్ని వచ్చాయో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో డేటాతో సహా వివరిస్తున్నారు. అంతే కాదు ఉత్తరాంధ్రా అమరావతి తిరుపతిలను ఎకనామిక్ జోన్లుగా చేస్తూ మూడు రీజియన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఆ యాక్షన్ ప్లాన్ ని ప్రకటించారు. అలాగే ప్రతీ ప్రాంతంలో ఉన్న సహజ వనరులకు తగినట్లుగా పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి వికేంక్రీకరణతో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారు. విజన్ 2047 అని ఒక భారీ బ్లూ ప్రింట్ తో బాబు ముందుకు సాగుతున్నారు.

జగన్ విజన్ ఏమిటి :

మరి సంక్షేమం విషయం వరకూ జగన్ ఓకే అనుకున్నా అభివృద్ధి విజన్ ఏదీ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలో అయిదు కోట్ల మంది ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. అలాగే ఉపాధి అవకాశాలు వారు ఆశిస్తున్నారు. వైసీపీ ఈ రోజుకీ రాజధాని విషయంలో క్లారిటీని ప్రకటించలేకపోతోంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని తమ హయాంలో పూర్తి చేయలేక పోయింది. ఏపీలో మూడు ప్రాంతాలలో తమదైన అభివృద్ధి అజెండా నమూనాను ఆవిష్కరించడంలో వెనకబడుతోంది అని అంటున్నారు. ఏపీ అంటే సంక్షేమ పధకాలను అందుకునే లబ్దిదారులు మాత్రమే ఉండరని, మధ్యతరగతి ఉన్నత తరగతి వర్గాలు కూడా ఉంటాయని గుర్తు చేస్తున్నారు వీరంతా డెవలప్మెంట్ కోరుకుంటారు అని చెబుతున్నారు. వైసీపీ ఎంతసేపూ తమ విధానంతోనే ముందుకు పోతే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఇప్పటికి అయినా మించిపోయింది లేదని వైసీపీ తన డెవలపమెంట్ స్ట్రాటజీస్ ఏమిటి ఏపీని ఎలా ముందుకు తీసుకుని వెల్దామనుకుంటున్నది జనాలకు తరచూ వివరించే ప్రయత్నం చేయకపోతే 2029 ఎన్నికల్లో కూడా కూటమి నుంచి భారీ సవాల్ ఎదురవుతుందని అంటున్నారు.