Begin typing your search above and press return to search.

చెన్నై వెడ్డింగ్ లో జగన్ హల్ చల్.. ఆ ఇద్దరు మిస్!!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ వ్యవహారాలు సైతం రాజకీయంగా ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటున్నాయి.

By:  Tupaki Political Desk   |   9 Feb 2026 3:22 PM IST
చెన్నై వెడ్డింగ్ లో జగన్ హల్ చల్.. ఆ ఇద్దరు మిస్!!
X

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ వ్యవహారాలు సైతం రాజకీయంగా ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటున్నాయి. తాజాగా చెన్నైలో జరిగిన ఓ పెళ్లి వేడుకపై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఏపీ మాజీ సీఎం జగన్ హాజరైన ఈ వివాహ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు. దగ్గరి బంధువులు, దూరపు బంధువులు సైతం వీడియోల్లో సందడి చేస్తూ కనిపించారు. కానీ, వైఎస్ ఇంటి ఆడబిడ్డలైన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఎక్కడ కనిపించలేదు. ఫ్యామిలీ వేడుకలో ఈ ఇద్దరు ఆడబిడ్డలు కనిపించకపోవడంపై అంతా చర్చించుకుంటున్నారు.




మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు జార్జిరెడ్డి మనవడు సాహిల్ వివాహం చెన్నైలోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. చెన్నై నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మురుగప్పన్ చెట్టియార్ కుటుంబంతో వైఎస్ కుటుంబం వియ్యం అందుకోవడం ఉభయ రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాహానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ తమిళనాడుకు చెందిన రాజకీయ ప్రముఖులు, సినీ స్టార్స్ తో ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది.




ఇక వైఎస్ కుటుంబంలో దాదాపు అందరూ ఈ వేడుకల్లో కనిపించారు. మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మతోపాటు జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు సైతం పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైఎస్ కుటుంబంలోని మహిళలు అందరూ ఈ వివాహ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే జగన్ చెల్లెళ్లు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత మాత్రం వివాహ వేడుకల్లో కనిపించకపోవడం వెలితిగా ఉందని ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.




కుటుంబం అంతా ఆనందంగా జరుపుకున్న వేడుకలో ఇద్దరు ఆడబిడ్డలు గైర్హాజరీ లోటుగా ఉందని అంటున్నారు. అయితే వారిద్దరు ఎందుకు చెన్నై వెళ్లలేదనేదే పెద్ద చర్చగా మారింది. మాజీ సీఎం జగన్ తో కొన్నేళ్లుగా ఈ ఇద్దరు విభేదిస్తున్నారు. తండ్రి హత్య కేసులో నిందితులను వెనకేసుకు వస్తున్నారని సునీత మాజీ సీఎం జగన్ పై గుర్రుగా ఉన్నారని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అదే సమయంలో జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకంపై వివాదం కూడా నడుస్తోంది. ఈ ఇద్దరు జార్జిరెడ్డి ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు వెళ్లకపోడానికి జగన్ తో విభేదాలే కారణమా? అని అనుమానిస్తున్నారు.




ఆస్తుల విషయంలో మాజీ సీఎం జగన్, ఆయన తల్లి విజయమ్మకు మధ్య కూడా కోర్టులో వివాదం నడుస్తోంది. అయినప్పటికీ ఆమె చెన్నైలో జరిగిన వివాహ వేడుకకు వెళ్లారు. అంతేకాకుండా కుమారుడు జగన్ రెడ్డిని హత్తుకుని ఆప్యాయంగా పలకరించారు. ఈ వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు గత ఏడాది షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ సతీసమేతంగా వెళ్లారు. దీంతో వివాదాలు వేరు, శుభకార్యక్రమాలు వేరు అన్న సంకేతాలు ఇచ్చారు. కానీ, ఇప్పుడు జగన్ వెళ్లారనే చెల్లెళ్లు ఇద్దరూ వెళ్లలేదా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిజానికి షర్మిల, సునీత వివాహానికి వెళ్లకపోతే పెద్దగా చర్చించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, జగన్ తో ఉన్న వివాదాల కారణంగా కుటుంబానికి వారు దూరమవుతున్నారా? అనే సందేహాలే ఈ చర్చకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని అంటున్నారు.